‘అగ్రిగోల్డ్‌’లో కొత్త ట్విస్ట్‌లు 

Key Issues Are Coming In Agrigold Case - Sakshi

బినామీలను గుర్తించడంలో గత దర్యాప్తు అధికారులు విఫలం

మిడ్జిల్‌లోని 150 ఎకరాల వ్యవహారంపై తాజాగా కదులుతున్న డొంక   

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసు పునర్విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్‌కు బినామీ కంపెనీలుగా ఉన్న నాలుగు కంపెనీలను గుర్తించడంలో విఫలమైన గత దర్యాప్తు అధికారులు... వాటిని అమ్మిన, కొన్న వ్యక్తుల విచారణలోనూ విఫలమైనట్లు సీఐడీ ఉన్నతాధికారులు తాజాగా గుర్తించారు. 76 ఎకరాలకు సంబంధించి జరిగిన లావాదేవీల్లో కొనుగోలు చేసిన వ్యక్తిని బినామీగా ఆరోపించిన గత అధికారులు... మరి నాలుగు కంపెనీల్లో డైరెక్టర్‌గా లేదా కనీసం ఉద్యోగిగా కూడా లేని వ్యక్తి విక్రయాలు సాగించడంపై ఎందుకు దృష్టి సారించలేదన్నది ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

2016లో 76 ఎకరాల భూమి అమ్మకం జరగ్గా కొనుగోలు చేసిన వ్యక్తిని బినామీగా గత దర్యాప్తు అధికారులు అనుమానిస్తూ 2020లో పలు విభాగాలకు లేఖలు రాశారు. బినామీ కంపెనీల నుంచి భూములు కొన్న వ్యక్తి హైకోర్టు ఆదేశాల ప్రకారం మహబూబ్‌నగర్‌లోని మిడ్జిల్‌లో 150 ఎకరాల అగ్రిగోల్డ్‌ భూమిని 2018లో వేలంపాటలో దక్కించుకున్నాడు. అప్పుడు వేలంపాట కమిటీలో ఉన్న సీఐడీ దర్యాప్తు అధికారి ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నది ఇప్పుడు సీఐడీ ఉన్నతాధికారులకు అంతుచిక్కకుండా ఉంది.

ఇది నిర్లక్ష్యమా లేకా మరేదైనా వ్యవహారమా అన్నది తేల్చే పనిలో ఉన్నతాధికారులున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే దర్యాప్తు అధికారిని మార్చి ప్రస్తుతం అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం. అగ్రిగోల్డ్‌ బినామీ కంపెనీల పేరిట ఉన్న 76 ఎకరాల భూమిని గుర్తించలేని దర్యాప్తు అధికారులు 2020లో అకస్మాత్తుగా ఎలా గుర్తించారు? గుర్తించినా అర్హతలేని వ్యక్తి అమ్మకం సాగించినా కేసు ఎందుకు పెట్టలేదు? కొనుగోలు చేసిన వ్యక్తికి అవి అగ్రిగోల్డ్‌ భూములు కాదని ఎలా తెలుస్తుంది? బినామీ కంపెనీలను ఎందుకు కేసులోకి లాగలేకపోయారు వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top