గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా | KCR Said That Tribals Need To Get Equal Status Across The Country | Sakshi
Sakshi News home page

గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా

Sep 18 2022 2:42 AM | Updated on Sep 18 2022 7:42 AM

KCR Said That Tribals Need To Get Equal Status Across The Country - Sakshi

బంజారా భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సేవాలాల్‌ మహరాజ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌

గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా దక్కాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా దక్కాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గిరిజనులు ఎస్టీలుగా, బీసీలుగా, ఓసీలుగా ఉంటున్నారని.. అలా కాకుండా వారందరికీ సమాన హోదా దక్కే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సేవాలాల్‌ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్‌లను సీఎం శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఎస్టీలకు గజంజాగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరిజనులు, ఆదివాసీలు తలెత్తుకునేలా ఆధునిక హంగులతో రెండు భవనాలను నిర్మించాం. ఈ రెండు భవనాలు దేశంలోని గిరిజన సమాజానికి స్పూర్తిగా నిలవాలి. ఇక్కడ పెళ్లుళ్లు, పేరంటాలు వంటివి కాకుండా గిరిజనులను ఉన్నతీకరించే ఆలోచనలకు కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

ఆదివాసీ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కుమురం భీం విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌  

రాష్ట్రంలో పోడు భూముల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పోడు సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, అవన్నీ సమర్థంగా పనిచేసేలా గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. గిరిజన భవన్, ఆదివాసీ భవన్‌లను చక్కటి సమావేశాలు నిర్వహించుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. ‘ఏ తండాలో ఏ సమస్యలున్నాయి? వాటిని ఎలా రూపుమాపాలి? ఏ విధంగా ప్రభుత్వ సేవలు అందిపుచ్చుకోవాలి? అనే కోణంలో సదస్సుల నిర్వహణకు ఈ భవనాలు వేదిక కావాలి. ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా వెళ్లి రక్షణగా నిలవాలి. అప్పుడే ఈ భవనాలకు సార్థకత లభిస్తుంది’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కాగా సీఎం కార్యక్రమ సమయంలో.. ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 12 శాతానికి పెంచాలంటూ బంజారా, ఆదివాసీ భవన్‌ల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement