గర్భిణులకు ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌’

KCR Nutrition Kit Will Distributed To Pregnant Womens Across Telangana - Sakshi

రక్తహీనతను నివారించేందుకు సర్కారు కొత్త పథకం 

రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో నేటి నుంచి పంపిణీ  

1.25 లక్షల మంది గర్భిణులకు అందజేత 

ఖర్జూరం, న్యూట్రిషన్‌ మిక్స్‌ పౌడర్, నెయ్యి తదితరాలు 

సాక్షి, హైదరాబాద్‌/కామారెడ్డి: మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ‘కేసీఆర్‌ కిట్‌’ స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లకు రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు.

అదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఆదిలాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ములుగులో సత్యవతి రాథోడ్, జయశంకర్‌ భూపాలపల్లిలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వికారాబాద్‌లో సబిత ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, గద్వాల్‌ జిల్లాలో మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొంటారు. ఇప్పుడు 1.25 లక్షల మంది గర్భిణులకు ఇది ఉపయోగపడనుందని అంచనా. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. 

రక్తహీనత నుంచి విముక్తి 
రక్తహీనత గర్భిణుల పాలిట శాపంగా మారుతోంది. దీనివల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్న ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో విజయవంతమైంది.

ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృ మరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పథకాన్ని అమలు చేస్తోంది. అత్యధికంగా కొము­రంభీం జిల్లాలో 83 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నా­రు.

ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లను పోష­కాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్‌ శాతం పెంచడం న్యూట్రిç­Ùన్‌ కిట్ల లక్ష్యం. ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.1,962 వెచ్చిస్తోంది. 13–27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌ చెకప్‌ సమయంలో ఒకసారి, 28–34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌ చెకప్‌ సమయంలో రెండోసారి కిట్‌ను ఇస్తారు. 9 జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాలు, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. 

తల్లీబిడ్డల సంరక్షణకు ఎక్కడా లేని పథకాల అమలు :హరీశ్‌రావు 
సాక్షి, హైదరాబాద్‌: ‘తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుంది. అందుకే తల్లీబిడ్డల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు’అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌.. పౌష్టికాహారాన్ని అందించి, తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనుందని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top