అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం.. | kamareddy district road incident | Sakshi
Sakshi News home page

అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..

May 27 2025 8:50 AM | Updated on May 27 2025 8:50 AM

kamareddy district road incident

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి  

ఇద్దరు చిన్నారులకు గాయాలు 

 గల్ఫ్‌లో తండ్రి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్‌లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్‌ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్‌(6), శివాన్‌‡్ష(3) ఉన్నారు. 

మహేందర్‌ ప్రస్తుతం గల్ఫ్‌లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్‌ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు.  

అమ్మా.. లేమ్మా.. 
గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్‌లో ఉన్న మహేందర్‌కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌ ముక్క శంకర్‌ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.    

Advertisement
 
Advertisement
Advertisement