
కూకట్‌పల్లి ఘటనలోఆరుకు చేరిన మృతుల సంఖ్య
వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 32 మంది
క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్‌తో కల్లు తయారీ
మోతాదుకు మించిన రసాయనాలతో ప్రాణాలకే ప్రమాదం
గ్రేటర్‌లోని కల్లు కాంపౌండ్లలో కొరవడిన తనిఖీలు
మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాజధాని నగరంలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. ఆరుగురి అమాయకుల ప్రాణాలను బలిగొంది. మోతాదుకు మించిన రసాయనాలు కలిపి తయారు చేసిన కల్లు తాగి నిరుపేదలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మంగళవారం నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న కల్లు కాంపౌండ్లలో హైదర్‌నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించగా.. బుధవారం వరకు ఆరుగురు మృతి చెందారు. మరో 32 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
తనిఖీలు నామమాత్రం..
నగరం సహా శివారులోని పలు కాంపౌండ్లలో కల్లు అమ్మకాలపై తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో కల్తీ కల్లు విక్రయాలకు అడ్డే లేకుండా పోయింది. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు కల్లు కాంపౌండ్‌లపై నిఘా ఉంచకపోవడంతోనే వాటి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్‌శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే కూకట్‌పల్లి విషాదాంతం జరిగినట్లు తెలుస్తోంది.
ఇష్టారాజ్యంగా కల్లు కాంపౌండ్లు..
ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ కల్లు ఉండదని చెప్పవచ్చు. డిమాండ్ మేరకు కల్లు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. మద్యం ధరలు భారీగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుతో సేదతీరుతున్నారు. వీరి బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి ప్రమాదకర రసాయపాలను వినియోగించి కల్లు తయారు చేస్తున్నారు. తయారీలో మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండటంతో.. ఈ కల్లు తాగినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గ్రేటర్‌తో సహా శివారుల్లోని పలు ప్రాంతాలు, బస్తీలు, పురపాలక సంఘాల్లో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లు కాంపౌండ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ çపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కల్తీ జరుగుతోందనే ఆరోపణలుతున్నాయి.
ఒకే లైసెన్స్‌తో.. ఎన్నో కాంపౌండ్లు..
నగరంతో సహా పలు చోట్ల ఒకే కల్లు దుకాణం లైసెన్సు పొంది ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక లైసెన్స్ ఒకటే దుకాణం నడిపించాల్సి ఉంటుంది. అయినా వ్యాపారులు మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారుతోంది.
నాడీ వ్యవస్థపై ప్రభావం..
డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, మానసిక విచక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. సాధ్యమైనంత వరకు ఈ కల్లు తాగకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.