రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు | Kaleswaram: Saraswati River Pushkaralu Starts May 15th | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు

May 14 2025 6:54 PM | Updated on May 14 2025 8:15 PM

Kaleswaram: Saraswati River Pushkaralu Starts May 15th

హైదరాబాద్:  సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రేపు(గురువారం) పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకూ జరుగనున్నాయి.

పుష్కరాల వేళ.. 
సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే  నీళ్లు పూర్తిగా అడుగంటాయి.

పుష్కరాలకు నెల ముందు నుంచి  నీటి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్‌ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు.

ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి.  ప్రాణహిత బేసిన్‌ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లు ఉండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement