breaking news
Saraswati river
-
పుష్కర సరస్వతికి ప్రణామం
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44 గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీ నది పుష్కరాలు (Saraswati River Pushkaralu) ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్‌కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. – షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా) -
నేటి నుంచి సరస్వతీ నది పుష్కరాలు
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతీ నదికి గురువారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి 10.45 గంటలకు బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నట్లు పండితులు పేర్కొన్నారు. అయితే రాత్రి సమయం కావడంతో గురువారం ఉదయం 5.44 గంటలకు అంతర్వాహిని సరస్వతీ నదికి విశేష పూజలతో పండితులు పుష్క రుడికి ఆహ్వానం పలుకుతారని కాళేశ్వరం దేవస్థానం వేదపండితులు వివరించారు. కాళేశ్వరాలయంనుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. మెదక్ జిల్లా రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి, మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కరాల పవిత్రతను కాపాడాలిసరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. -
రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు
హైదరాబాద్: సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రేపు(గురువారం) పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకూ జరుగనున్నాయి.పుష్కరాల వేళ.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి.పుష్కరాలకు నెల ముందు నుంచి నీటి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు.ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లు ఉండటం విశేషం. -
పుష్కరాలకు నీళ్లొచ్చాయి
సాక్షి, హైదరాబాద్: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలకు పెద్ద టెన్షన్ దూరమైంది.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి. పుష్కరాలకు నెల ముందు నుంచి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు. కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం దేవాలయానికి దాదాపు 80 కి.మీ. దూరంలో ఉంది. ఇసుక తేలిన నదిలో చాలా నీళ్లు ప్రవాహంలోనే ఇంకుతాయి. పుష్కరాల నాటికి ప్రచండ ఎండలుండనున్నందున ప్రవాహంలో నీళ్లు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వీటిని తట్టుకొని నీళ్లు దేవాలయం వరకు చేరాలంటే నిత్యం 5 వేల క్యూసెక్కుల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఎల్లంపల్లిలో కూడా కనిష్ట స్థాయిలోనే నీటి నిల్వ ఉన్నందున, ఉన్న నీటిలో రోజుకు 5 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తే తాగు, సాగు నీటికి కటకట ఎదురవుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లున్నాయి.దీంతో ముందు జాగ్రత్త చర్యగా 5 అడుగుల ఎత్తు వరకు నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడి వరకు భక్తులను స్నానాలకు అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలు కొనసాగే ఈనెల 26 వరకు స్నానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.రేపటి నుంచి 26 వరకు పుష్కర సంబురంహాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షిప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరం వద్ద పుష్కర సంబురం గురువారం ప్రారంభం కానుంది. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 15న సీఎం రేవంత్‌రెడ్డి రానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్‌ను సరస్వతి ఘాట్ సమీపంలో నిర్మించారు. రూ.కోటితో తయారు చేసిన రాతి సరస్వతీమాత విగ్రహం, రూ.55 లక్షలతో టెంట్‌సిటీ, హారతి గద్దెలు నిర్మించారు. వీటిని సీఎం ప్రారంభిస్తారు. పుష్కరాలకు 12 రోజుల పాటు పీఠాధిపతులు రానున్నారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానందసరస్వతి పుష్కర ప్రారంభ పూజలో పాల్గొంటారు. కాశీపండితులచే 12 రోజులు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. 330 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజూ ఉంటాయి. 12 రోజులపాటు దేవాలయంలోని యాగశాలలో యాగాలు నిర్వహిస్తారు. -
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతీ నదికి వచ్చే నెలలో పుష్కరాలు ఉన్నాయి.. సరిగ్గా మండే ఎండల్లో పుష్కరాలు నిర్వహించాల్సి రావటంతో కొత్త చిక్కు ముంచుకొస్తోంది.. భక్తులు పుణ్యస్నానాలాచరించాల్సిన గోదావరి నది వేగంగా అడుగంటుతోంది. పుష్కరాలకు మరో 37 రోజులున్నందున.. అప్పటికి నీళ్లు దాదాపు ఇంకిపోనున్నాయి. నదిలో నీళ్లే లేకుంటే భక్తులు స్నానాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఇదే ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్య సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారుల బృందం ప్రయాగ్‌రాజ్ వెళ్లి మహాకుంభమేళా నిర్వహణ తీరును అధ్యయనం చేసి వచ్చిoది. కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేసిన విధానాన్ని పరిశీలించింది. వచ్చే ఏడాది, ఆపై సంవత్సరం గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు ఉన్నాయి. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ముందు ప్రారంభంకానున్న సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, పుష్కరాలకు అతి ముఖ్యమైన నదీ జలాలే లేకుంటే ఎలా అని అధికారులు తర్జనభర్జనలో మునిగిపోయారు. తాజాగా దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయి దీనిపై చర్చించారు. తాత్కాలిక అడ్డుకట్టతో నీటి నిల్వ ప్రస్తుతం గోదావరి దాదాపు అడుగంటింది. ప్రాణహిత నదిలో కొంత నీటి ప్రవాహం ఉంది. కాళేశ్వరం దేవాలయం సమీపంలో నదీగర్భంలో తాత్కాలిక అడ్డుకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసి పుష్కర స్నానాలకు వాడాలన్న ప్రతిపాదన వచ్చిoది. కానీ, మండే ఎండల్లో నిల్వ నీటిలో బ్లూగ్రీన్ ఆల్గే బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదం ఉంటుందని, ఆ నీటిలో స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉండనున్నందున అది ఆచరణీయం కాదని భావిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల కాళేశ్వరం దేవాలయానికి ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి నదిలో స్నానాలకు నీళ్లు ఉండేలా చూడాలన్నది మరో ఆలోచన. కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం దేవాలయానికి దాదాపు 80 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుతం గోదావరిలో భారీ గుంతలున్నాయి. ఆ గుంతలు నిండితేనే ప్రవాహం ముందుకు సాగుతుంది. ఇసుక తేలిన నదిలో చాలా నీళ్లు ప్రవాహంలోనే ఇంకుతాయి. పుష్కరాల నాటికి ప్రచండ ఎండలుండనున్నందున ప్రవాహంలో నీళ్లు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వీటిని తట్టుకుని నీళ్లు దేవాలయం వరకు చేరాలంటే నిత్యం 5 వేల క్యూసెక్కుల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులంటున్నారు. అది అంత సులభం కాదనే అభిప్రాయమూ ఉంది. బోర్లు వేయటం ద్వారా నదిలో శక్తివంతమైన బోర్లు తవ్వించటం ద్వారా నీటిని పైకి లాగి తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసి నీటిని నింపాలన్నది ఒక ఆలోచన. ఇక ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పుష్కర ఘాట్లపై షవర్లు ఏర్పాటు చేసి జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలన్నది మరో ఆలోచన. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు మనదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారంతా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. వీటిలో ‘సరస్వతి బావి’ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున, అదృశ్య సరస్వతి(Invisible Saraswati) నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రివేణి సంగమానికి కొద్ది దూరంలోని సరస్వతి బావి ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ సరస్వతి మాత జలాన్ని నేరుగా దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ కోటలో కనిపించే ఈ సరస్వతి బావి.. సరస్వతి నదికి రహస్య వనరు అని పండితులు చెబుతుంటారు. ఈ బావి నుంచి ఊరుతున్న నీటి ప్రవాహం నేరుగా త్రివేణి(Triveni) సంగమానికి అనుసంధానమై ఉంది. 2016లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాగించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సరస్వతి బావికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సుబేదార్ మేజర్ రామ్ నారాయణ్ పాండే మాట్లాడుతూ ఇక్కడి నీటి ఊట బావి ఆకారంలో ఉన్నందున దీనికి సరస్వతి బావి అనే పేరు వచ్చిందన్నారు. సరస్వతి నది మానా గ్రామంలో ఉద్భవించిందని చెబుతుంటారు.పురాణాలలోని వివరాల ప్రకారం మహర్షి వేద వ్యాసుడు(Maharishi Veda Vyas) చెబుతుండగా గణేశుడు 18 పురాణాలను రాస్తున్నాడు. అయితే అదే సమయంలో సరస్వతి నది ప్రవాహ ధ్వని కారణంగా గణేశునికి వినికిడి సమస్య ఏర్పడిందట. దీంతో సరస్వతి మాత తన నీటి ప్రవాహాన్ని పాతాళం వైపు ప్రవహించాలని ఆదేశించిందట. సరస్వతి ప్రవాహం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న సమయంలో విష్ణువు ఆ నీటిని సంగమంలో విలీనం చేయమని సరస్వతి మాతను కోరాడట. దీనికి సర్వస్వతి మాత సమ్మతించిందట. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సరస్వతి బావిని తప్పకుండా సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్‌కు భారీ షాక్.. -
‘సరస్వతి’ నిజంగానే ఉండేది
తేల్చిన వాల్దియా కమిటీ - మళ్లీ పారించే అంశాన్ని పరిశీలిస్తాం: ఉమా భారతి న్యూఢిల్లీ: ఇప్పటిదాకా పురాణాలలోనిదిగా భావించిన సరస్వతి నది ఒకప్పుడు భూమిపై నిజంగానే ప్రవహించిందని ప్రభుత్వం నియమించిన వాల్దియా కమిటీ తేల్చింది. కమిటీ తన నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి సమర్పించింది. నది ఉన్నట్లు తేల్చినందుకు కమిటీని ఆమె ప్రశంసిస్తూ నివేదికలోని విషయాన్ని తోసిపుచ్చలేమనీ, అలాగే తాము దీన్ని ఇంకా ఆమోదించలేదని అన్నారు. నిపుణులతో చర్చించి, త్వరలోనే కేబినెట్ ముందుకు నివేదికను తీసుకొస్తామన్నారు. పాలియోచానెల్(నది ఒకప్పుడు ప్రవహించి, తన దిశను మార్చుకున్నపుడు వట్టిగా మిగిలిపోయిన ప్రాంతాలు)లో పెద్దమొత్తంలో స్వచ్ఛమైన నీరు ఉందని, దాన్ని వెలికితీసి కరువు ప్రాంతాలదాహం తీర్చాలని వాల్దియా అన్నారు. కృత్రిమ పద్ధతుల్లో నదిని మళ్లీ పారించే అంశాన్ని పరిశీలిస్తామని ఉమ చెప్పారు. నది సాగిన మార్గమిది ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీకి నాయకత్వం వహించిన భూగర్భ శాస్త్రజ్ఞుడు కేఎస్ వాల్దియా, 6 నెలల తమ పరిశోధన గురించి వివరించారు. ‘సరస్వతి హిమాలయాల్లో పుట్టి గుజరాత్‌లోని గల్ఫ్ (భూభాగంలోకి చొచ్చుకుని వచ్చినట్లు ఉండే చిన్న సముద్రభాగం) వద్ద అరేబియా సముద్రంలో కలిసేది. సముద్రంలోకి చేరేముందు పాకిస్తాన్‌లోని రాన్ ఆఫ్ కచ్ గుండా ప్రవహించేది. పొడవు 4 వేల కి.మీ. నది మూడింట ఒక వంతు ప్రస్తుత పాక్‌లో, రెండొంతులు భారత్‌లో ప్రవహించేది. నది రెండు శాఖలు (పశ్చిమ, తూర్పు)గా విడిపోయి ప్రవహించేది. శాఖలు పంజాబ్‌లోని షూత్రణ వద్ద మళ్లీ కలిసేవి. తర్వతా రాన్ ఆఫ్ కచ్ ను దాటి వెళ్లి అరేబియా సముద్రంలో నది కలిసేది.హరప్పా నాగరికత కాలంలో పాలియోచానెల్ తీరంలో 1,700 చిన్న, పెద్ద గ్రామాలు ఉండేవి. ఇవి 5,500 సంవత్సరాలపాటు ఉనికిలో ఉన్నాయి. నీళ్లు లేకుండానే అక్కడి ప్రజలంతా అన్నేళ్లు బతికి ఉండరు. పారే పెద్ద నదే వారికి జీవనాధారం అయ్యుంటుంది. అయితే అది ఏ నది అనేది కనుక్కొడానికి మేం పరిశోధనలు చేసి సరస్వతి అని గుర్తించాం’ అని తెలిపారు. -
కోఠీలో పారి... ప్రతి ఊర్లోనూ ఊరి
..ప్రవహించి అంతరించిన... సరస్వతీ నది! గంగా, యమునా, సరస్వతి భారతదేశ సంస్కృతిని ఇనుమడింపజేసే నదులని ప్రస్తుతిస్తాం. గంగా, యమునా మనకు కనిపించే నదులు. కానీ సరస్వతి అక్కడెక్కడో అలహాబాద్‌లో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అందరూ అంటుంటారు. కానీ.. అది అలహాబాద్‌లో లేదనీ.. హైదరాబాద్‌లో ఉందని నా బలమైన నమ్మకం. అలా నమ్మకపోతే.. ఇది చదివాక మీరే నమ్మి తీరుతారు. అవును.. సరస్వతి నది ఇప్పుడు అంతరించిన అంతర్వాహినే. కానీ కొన్నేళ్ల క్రితం కోఠీ ఉమెన్స్ కాలేజీ పక్క నుంచి ప్రవహించిన జీవనది. చదువరులకు ఓ సజీవ పెన్నిధి. పుష్కరాల నాటి స్నాన ఘట్టాల్లా సదరు సరస్వతీ నది ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ చిన్న చిన్న కొట్లు. వరస పుస్తకాల కొట్లు! ప్రతి కొట్టు ఎదురుగా కొట్టుకుంటున్నట్టుగా పఠితలూ, కొనుగోలుదారులు. గాంధీ జ్ఞానమందిరానికి ఎదురుగా ఉన్న ఆ కొట్లన్నింటిలోనూ ఎన్నో విజ్ఞాన తరంగాలు. భవిష్యత్ కలలను నెరవేర్చేందుకు ఉపకరించే పుస్తకాల పుటల రూపంలో అలరారే అలలు. కుంభ మేళా నాడు ఎక్కడెక్కడి సాధు పుంగవులంతా గంగకు చేరినట్టు... ఎన్నెన్నో పోటీ పరీక్షల సీజన్లలో దాదాపు ఇరు రాష్ట్రాల ఊళ్ల నుంచి సదరు సరస్వతీ నదీస్నానం కోసం ఇక్కడి సరస్వతమ్మ స్నాన ఘట్టాల్లోకి చేరి పుస్తకాలు కొనేవారూ, చదువుకొనేవారు. అది ఉమెన్స్ కాలేజీ కాబట్టి ఒక ఒడ్డున కనుల పంట. మరో ఒడ్డున విజ్ఞాన అలల పంట. మీ కంట ఏ పంట నాటితే... మీ మనసులో సదరు మొలకల సందడి. ఆ మొలకలు ఎదిగితే మీరు కోరిన దిగుబడి. ఇప్పుడంటే అంతరించిది కానీ... ఈ సరస్వతీ నది ఆ రోజుల్లో ఎందరికో ఎంతో మేలు చేసింది. సదరు సరస్వతీ తీరంలో లక్ష్మి కోసం బెంగక్కర్లేదు. మీ దగ్గర కొనడానికి డబ్బుల్లేవా? పుస్తకాలను కిరాయికే ఇచ్చేవారు. మీరు చదివాక మళ్లీ తీసుకు పోయి ఇస్తే... కొంత మినహాయించుకుని మీ డబ్బు మీకు వాపస్. చేతిలో పుస్తకం ఉంటే జేబులో డబ్బున్నట్టే. ఆ శంభు దేవుడికి సేవ చేశాక సువర్ణముఖీ తీరాన ఇసుక పట్టుకుంటే చాలు బంగారమయ్యేదట. మీకు దక్కే బంగారమంతా మీరు చేసిన సేవకు అనులోమానుపాతంగా ఉంటుందట. అందుకే ‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ’ అన్నది అక్కడి సామెత. అలాగే... ఈ సరస్వతీ తీరంలోనూ ‘చదువుకున్నవాడికి చదువుకున్నంత’ అన్నది ఇక్కడి వాడుక. కోఠీ తీరాన ఘనాపాటీలెందరో ఈ సరస్వతీ కటాక్ష వీక్షణాది దీవెనలతో అంతరించిన ఈ అంతర్వాహినిలో మునకలేశారు. ఇక్కడ తరంగిణులపై ఓలలాడిన ఎందరో ఈ అలల మీది నుంచే అందలాలెక్కారు. చదువు వంకన నదిలోకి దిగి చదివి గట్టెక్కలేని మరెందరో అంతరించిన ఈ నదిలో మునిగి తాము కోరిన వైపునకు కాక మరో అవతలి ఒడ్డుకు కొట్టుకుపోయారు. ఒక తరం పోటీ పరీక్షలకు చదివినవారంతా ఈ నది ఒడ్డున మూగినవాళ్లే. నది ఎప్పటికీ అంతరించదు. మళ్లీ తనను తాను ఆవిష్కరించుకుంటూనే ఉంటుంది. కాస్త దారి మార్చుకుంటుంది. ఇవ్వాళ కోఠీ ఉమెన్స్ కాలేజీ ప్రహరీ ఒడ్డున అంతరించిన ఈ నది... ఆ పక్కనే అవతలి వైపున అక్కడా ఇక్కడా కాస్త చెలమలుగా ఊరుతూ పుస్తక ప్రియులతో చెలిమి చేస్తోందట. ఒక్కమాట.. ఎన్నెన్నో కాలుష్యాలతో ముసిముసిగా ‘మూసీ’ ప్రవహిస్తున్నా.. ఆ నది నీళ్లు ఇవ్వాళ చాలామందికి పెద్దగా పనికి రావడం లేదేమోగానీ... పూర్తిగా అంతరించిపోతేనేం! సదరు సరస్వతీ నదిని ఒక తరం వారందరూ గుర్తు పెట్టుకునేవారే! అందలాలకెక్కి ఉన్నవారు ఎప్పటికీ రుణం తీర్చుకోలేనివారే! ఇది కీడులో జరిగిన మేలే కదా!! - యాసీన్