
మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇటీవలి వానలతో నీటి ప్రవాహం
కాళేశ్వరం వద్ద 30 సెం.మీ. మేర పెరిగిన నీటిమట్టం
సరస్వతీ పుష్కరాలకు తప్పిన నీటికొరత గండం
సాక్షి, హైదరాబాద్: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలకు పెద్ద టెన్షన్ దూరమైంది.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి.
పుష్కరాలకు నెల ముందు నుంచి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు.
కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం దేవాలయానికి దాదాపు 80 కి.మీ. దూరంలో ఉంది. ఇసుక తేలిన నదిలో చాలా నీళ్లు ప్రవాహంలోనే ఇంకుతాయి. పుష్కరాల నాటికి ప్రచండ ఎండలుండనున్నందున ప్రవాహంలో నీళ్లు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వీటిని తట్టుకొని నీళ్లు దేవాలయం వరకు చేరాలంటే నిత్యం 5 వేల క్యూసెక్కుల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఎల్లంపల్లిలో కూడా కనిష్ట స్థాయిలోనే నీటి నిల్వ ఉన్నందున, ఉన్న నీటిలో రోజుకు 5 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తే తాగు, సాగు నీటికి కటకట ఎదురవుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమైంది.
ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లున్నాయి.
దీంతో ముందు జాగ్రత్త చర్యగా 5 అడుగుల ఎత్తు వరకు నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడి వరకు భక్తులను స్నానాలకు అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలు కొనసాగే ఈనెల 26 వరకు స్నానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.
రేపటి నుంచి 26 వరకు పుష్కర సంబురం
హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరం వద్ద పుష్కర సంబురం గురువారం ప్రారంభం కానుంది. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 15న సీఎం రేవంత్‌రెడ్డి రానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్‌ను సరస్వతి ఘాట్ సమీపంలో నిర్మించారు. రూ.కోటితో తయారు చేసిన రాతి సరస్వతీమాత విగ్రహం, రూ.55 లక్షలతో టెంట్‌సిటీ, హారతి గద్దెలు నిర్మించారు. వీటిని సీఎం ప్రారంభిస్తారు.
పుష్కరాలకు 12 రోజుల పాటు పీఠాధిపతులు రానున్నారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానందసరస్వతి పుష్కర ప్రారంభ పూజలో పాల్గొంటారు. కాశీపండితులచే 12 రోజులు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. 330 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజూ ఉంటాయి. 12 రోజులపాటు దేవాలయంలోని యాగశాలలో యాగాలు నిర్వహిస్తారు.