
కాళేశ్వరం వద్ద నదిలో పుష్కర ఆవాహన పూజతో ప్రారంభం
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతీ నదికి గురువారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి 10.45 గంటలకు బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నట్లు పండితులు పేర్కొన్నారు. అయితే రాత్రి సమయం కావడంతో గురువారం ఉదయం 5.44 గంటలకు అంతర్వాహిని సరస్వతీ నదికి విశేష పూజలతో పండితులు పుష్క రుడికి ఆహ్వానం పలుకుతారని కాళేశ్వరం దేవస్థానం వేదపండితులు వివరించారు.
కాళేశ్వరాలయంనుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు.
మెదక్ జిల్లా రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి, మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్‌రావు, దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి
నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
పుష్కరాల పవిత్రతను కాపాడాలి
సరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు.