
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44 గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...
సరస్వతీ నది పుష్కరాలు (Saraswati River Pushkaralu) ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి.
పుష్కర స్నానం..పుణ్యఫలం..
పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..
తర్పణలు, పిండప్రదానాలు..
సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు.
పుష్కరకాల స్నానం..
నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.
నదికి వాయినాలు..
సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.
12 రోజులు హోమాలు..
మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు.
12 రోజులు హారతి..
12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు.
పీఠాధిపతుల పుష్కర స్నానాలు..
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్‌కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.
17 అడుగుల ఏకశిల
సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
– షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం
(భూపాలపల్లి జిల్లా)