TS High Court: హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎంఎస్‌  రామచందర్‌రావు 

Justice MS Ramachandra Rao Appointed As TS High Court In Charge CJ - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం 

1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ 

2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియామకం 

జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు తండ్రి, తాతలిద్దరూ జడ్జీలే..

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ మామిడన్న సత్యరత్న రామచందర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజిందర్‌ కష్యప్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు.. 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మిం చారు. సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో పదవ తరగతి, లిటిల్‌ ఫ్లవర్స్‌ కళాశాలలో ఇంటర్, భవన్స్‌ న్యూసైన్స్‌ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్‌), ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. ఎల్‌ఎల్‌బీలో ఎక్కువ మార్కులు సాధించినందుకు సీబీఎస్‌ఎస్‌ ఆచార్యులు స్మారక గోల్డ్‌ మెడల్‌ లభించింది.

1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీలో 1991లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్, బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్, కామర్స్‌ ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన సమయంలో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, డీసీసీ బ్యాంక్, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)తోపాటు పలు కంపెనీలు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ తరఫున వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు.

సివిల్, ఆర్బిట్రేషన్, కంపెనీలా, అడ్మినిస్ట్రేటివ్, కాన్సిస్ట్యూషనల్‌ లా, లేబర్, సర్వీస్‌ లాకు సంబంధించిన కేసులను వాదించడంలో పేరుపొందారు. జస్టిస్‌ రామచందర్‌రావు.. 2012, జూన్‌ 29న ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013, డిసెంబర్‌ 4న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ రామచందర్‌రావు తండ్రి జస్టిస్‌ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తి (1997–2000)గా పదవీ విరమణ చేశారు. అలాగే వీరి తాతయ్య జస్టిస్‌ రామచందర్‌రావు 1960–61లో హైకోర్టు జడ్జిగా సేవలు అందించారు. వీరి తాతయ్య సోదరుడు జస్టిస్‌ ఎం.క్రిష్ణారావు 1966–1973 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.    

చదవండి: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top