జేఈఈ వైపు విద్యార్థుల చూపు 

JEE Mains applications increased this time - Sakshi

ఈసారి పెరిగిన దరఖాస్తులు 

12.3 లక్షల అప్లికేషన్లు 

సిలబస్‌ తగ్గడమే కారణమా? 

ఈ నెల 24 నుంచి పరీక్ష..  

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఎన్‌టీఏ

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 24 నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మొదలవనుంది. ఫిబ్రవరి 1 వరకు ఇది కొనసాగుతుంది. పూర్తిగా కంప్యూటర్‌ ఆధారంగా జరిగే మెయిన్స్‌కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది 11.62 లక్షల మంది దరఖాస్తు చేస్తే, ఈ ఏడాది (2024) 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022లో వచ్చిన దరఖాస్తులు 10.26 లక్షలే కావడం గమనార్హం.

2014 తర్వాత నుంచి మెయిన్స్‌ రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్లాసులు సరిగా జరగకపోవడం ఒక కారణమైతే, కోచింగ్‌ కేంద్రాలు లేకపోవడం మరో కారణం. అయితే, 2022 నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. దీంతో మెయిన్స్‌కు పోటీ పెరిగింది.  

సిలబస్‌లో మార్పులూ కారణమే.. 
కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్‌ అంటే విద్యార్థులు భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు కష్టంగా ఉంటున్నాయి. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ ఇండక్షన్‌ అండ్‌ సింపుల్‌ అప్లికేషన్స్, మేథమెటికల్‌ రీజనింగ్, ప్లేన్‌ అండ్‌ డిఫరెంట్‌ ఫామ్స్‌తో మొత్తం 10 చాప్టర్స్‌లో ప్రశ్నలకు జవాబులు రాబట్టడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో ఇతర సబ్జెక్టుల్లో ప్రశ్నలకు జవాబులు రాసేందుకు సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్‌ పెరుగుతోంది.

కెమిస్ట్రీ సులభంగా ఉన్నప్పటికీ మేథ్స్‌ సమయం తినేయడంతో ఇందులో సరిగా ఆన్సర్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) దృష్టికి తెచ్చారు. దీంతో మేథ్స్‌లో పది చాప్టర్ల నుంచి ఈసారి ప్రశ్నలు ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి ఫిజిక్స్‌లోనూ ఉంది. 12 చాప్టర్ల నుంచి ప్రశ్నలివ్వడం మానేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. జియో స్టేషనరీ శాటిలైట్స్, డాప్లర్‌ ఎఫెక్ట్‌ఇన్‌ సౌండ్, కలర్‌ కోడ్‌ ఫర్‌ రెసిస్టర్స్‌ వంటి చాప్టర్లు ఇందులో ముఖ్యమైనవి.

కెమిస్ట్రీలో కష్టంగా ఉన్న 9 చాప్టర్లను మినహాయించారు. పాలిమర్స్, స్టేట్‌ ఆఫ్‌ మ్యాటర్స్, సర్ఫేస్‌ కెమిస్ట్రీ వంటి కీలకమైన చాప్టర్లున్నాయి. అదీగాక, తెలంగాణ, ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎంసెట్‌ నిర్వహించడం లేదు. జేఈఈ ర్యాంకు ఆధారంగానే రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఈ కారణంగా జేఈఈ రాయడం అనివార్యంగా మారింది. 

కట్టుదిట్టమైన ఏర్పాట్లు 
ఈసారి జేఈఈ మెయిన్స్‌ నిర్వహణకు ఎన్‌టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల బయోమెట్రిక్‌ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు పరీక్ష మధ్యలో వాష్‌రూంకు వెళ్లి, తిరిగి వచ్చినా బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్నేళ్లుగా సాంకేతిక సమస్యలు తలెత్తతున్న కేంద్రాలను గుర్తించి, ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ సాంకేతిక సమస్య వచ్చినా అప్పటికప్పుడు కంప్యూటర్‌ ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top