
సాక్షి, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యలు నిరాధారమన్నారు. తెలంగాణ ఆతిథ్యం నచ్చిందని ఆమె చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు’’ అని జయేష్ రంజన్ చెప్పారు.
‘‘నేను మిస్ వరల్డ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆమె కేవలం చౌమహల్లా ప్యాలస్ డిన్నర్‌లో మాత్రమే పాల్గొంది. ప్రతి టేబుల్‌లో పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు. ఆమె తోటి పోటీదారులను కూడా విచారించాం. అలాంటిది జరగలేదని చెప్పారు’’ అని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
మిస్ వరల్డ్ వివాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..
మరోవైపు, మిస్ వరల్డ్ వివాదంపై తెలంగాణ సర్కార్ విచారణకు ఆదేశించింది. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి షికా గోయల్, ఐపీఎస్ రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజమెంత? మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వివాదంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.