
తీవ్ర ఒడిదుడుకుల్లో ఐటీ ఉద్యోగులు
కోర్ గ్రూపులు వదిలి సీఎస్‌ఈ వైపు పరుగులు
కొన్నేళ్లుగా ఇదే విధానం సాగటంతో మారిపోయిన పరిస్థితులు
నాడు ఏరికోరి పిలిచిన కంపెనీల ముందే నేడు జాబ్ కోసం క్యూలు
కొత్తవారికి ప్యాకేజీలు కరువు.. ఉన్నవారికి లే ఆఫ్‌ల గుబులు
సాక్షి, హైదరాబాద్: అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆకర్షణీయమైన జీతం, జీవితం దక్కుతుందన్న ఆశతో కోర్ గ్రూపులు వదిలేసి, కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు పరుగులు పెట్టినవారు.. ఇప్పుడు చిన్నపాటి ప్యాకేజీలకు కూడా ఉద్యోగాలు లభించక, ఇప్పటికే ఫీల్డులో ఉన్నవారు అత్యాధునిక ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దెబ్బకు నిలబడలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు (లే ఆఫ్స్)లు పెరుగుతున్నాయి. సరైన నైపుణ్యాలు లేవని చెబుతూ సీనియర్లను కూడా తొలగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో భారత సర్విస్ సెక్టార్ వణికిపోతోంది. కరోనా తర్వాత ఏఐ వేగం పెరిగి అతిపెద్ద డేటా కేంద్రాలు వస్తున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ వీటికే కనెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా మానవ వనరుల అవసరం తగ్గింది. టెక్నాలజీతో సమానంగా ఉద్యోగులు పరుగులు పెట్టలేకపోతున్నారు. అందుకు కార ణం ఇంజనీరింగ్‌లో కోర్ గ్రూపులను నిర్లక్ష్యం చేయడమేనని నిపుణులు చెబుతున్నారు.

2024 చివరి నుంచి మారిన పరిస్థితి
ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. టీసీఎస్ 12 వేల మందికి లే ఆఫ్ అనేసింది. ఇన్ఫోసిస్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలదీ ఇదే బాట. 2010 నుంచి 2025 వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు భారీగా పెంచాయి. ఇన్ఫోసిస్ 153%, టీసీఎస్ 278%, విప్రో 116 శాతం, కాగి్నజెంట్ 223%, యాక్సెంచర్ 291% ఉద్యోగ నియామకాలు పెంచుకున్నాయి.
కరోనా (2020–21) కాలంలోనూ ఉద్యోగ నియామకాలు ఎక్కువే. ఇదే సమయంలో యాంత్రీకరణ వైపు కంపెనీలు మళ్లాయి. దీంతో 2024 వరకు ఉద్యోగుల అవసరం ఉండేది. 2024 చివరి నుంచి ఏఐ వేగం పెరగడంతో ఉద్యోగుల అవసరం తగ్గుతూ వచ్చింది. దీంతో ఒక్కో కంపెనీ 20 నుంచి 40 శాతం వరకు ఉద్యోగులను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు ప్రధాన కంపెనీల్లో కనీసం 15 శాతం ఉద్యోగులను తొలగించారు.

వేతనాలు అంతంతే..
పదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం హాట్‌కేక్. భారీ ప్యాకేజీలు.. కంపెనీ మారితే రూ.లక్షల్లో పెరుగుదల. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు అరకొరగా ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్‌లో అనేక దశల్లో పరీక్షలు పెడుతున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చినా అపాయింట్‌మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వేతనాల్లోనూ నిరాశే. 2010లో ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కు రూ.3.25 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఈ 15 ఏళ్లలో 49 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ లెక్క ప్రకారం ఈ సంవత్సరం రూ.6.40 లక్షల వేతనం ఇవ్వాలి.
కానీ రూ.3.60 లక్షలు మాత్రమే ఇస్తోంది. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఇప్పుడిచ్చే వేతనం రూ.3.15 లక్షలు మాత్రమే. టీసీఎస్‌లో 2007లో రూ.3.15 లక్షల వార్షిక వేతనం ఉంది. అప్పటి నుంచి 60 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. దీని ప్రకారం ఇవ్వాల్సింది రూ.4.73 లక్షలు. కానీ, ఆఫర్ చేస్తున్నది రూ.3.36 లక్షలే. దీన్నిబట్టి ఫ్రెషర్స్ వార్షిక ప్యాకేజీ దారుణంగా తగ్గిపోయిందని అర్థమవుతోంది.
ఇది అనారోగ్య పరిస్థితి
కంప్యూటర్ కోర్సుల వైపు పరుగులు పెట్టడం ఆనారోగ్యకరమైన పరిస్థితి. కోర్ గ్రూపులకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు భారీ పెరిగే వీలుంది. దీన్ని విద్యార్థులు గుర్తించడం లేదు. కోర్ గ్రూపుల విలువ తెలియజెప్పేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆ దిశగా మండలి ముందండుగు వేస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కంప్యూటర్ కోర్సులే భవిష్యత్ కాదని గుర్తించాలి. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
స్కిల్ లేకుంటే కష్టమే
యాంత్రీకరణ, ఏఐ వచి్చన తర్వాత సాధారణ కోడింగ్‌తో పని ఉండదు. ఏఐతో సమానంగా ఉద్యోగి అప్‌డేట్ అవ్వాలి. అలా ఎదగలేనివారిని కంపెనీలు తొలగిస్తున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు చేశామని ధీమాగా ఉండే పరిస్థితి పోయింది. కోర్ గ్రూపు చేసిన వాళ్లు కూడా అప్‌గ్రేడ్ అయితే ఐటీలో రాణించే అవకాశాలు ఉన్నాయి.
– భటా్నకర్ త్రిపాఠి, ఎంఎన్‌సీ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్
కంప్యూటర్ కోర్సులపై మోజే కారణం..
ఐటీ ఉద్యోగంపై మోజు దశాబ్ద కాలంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తెచ్చింది. విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు తప్ప వేటికీ భవిష్యత్ లేదని భావిస్తున్నారు. దీంతో ఈ కోర్సులు చేసిన వారి సంఖ్య భారీగా పెరిగిం ది. 2010–11లో దేశవ్యాప్తంగా కంప్యూ టర్ కోర్సులు చదివినవారు 4,75,870 మంది ఉంటే, 2023–24 నాటికి ఈ సంఖ్య 21,62,266కు చేరింది.
14 ఏళ్లలోనే 354 శాతం పెరిగింది. సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపులకు డిమాండ్ తగ్గుతోంది. ఆయా సెక్టార్లలో ఉపాధి అవకాశాలున్నా విద్యార్థులు వెళ్లడం లేదు. మరోవైపు ఐటీ సెక్టార్‌లో యాంత్రీకరణ, ఏఐ పాత్ర పెరగటంతో ఉద్యోగి కోసం కంపెనీలు వెతుక్కునే పరిస్థితి లేదు. కోర్ గ్రూప్‌లను నిర్లక్ష్యం చేయడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.