
తాజా ఎన్‌కౌంటర్‌లో సుప్రీం కమాండర్ కేశవరావు మృతి
ఒకవైపు ‘కగార్’తో తరుముతున్న సాయుధ బలగాలు
మరోవైపు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
తుడిచిపెట్టుకుపోతున్న పార్టీ నాయకత్వం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది.
కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్‌కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి.
కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు
మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్‌పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి.
గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్‌లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు.
దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్‌కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి.
క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ
మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.
ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్‌మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు.
తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’
దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్‌గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా..
1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్‌పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్‌జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు.
2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు.
3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు.
ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.