హైదరాబాద్: స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ కోసం క్వారీ వద్దకు వెళ్లిన బీటెక్ విద్యార్థి నీట మునిగి దుర్మరణం చెందాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి (17) కీసర పరిధిలోని చీర్యాలలోని గీతాంజలి కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆరుగురు స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ తీసుకునేందుకు జవహర్‌నగర్ మల్కారం పరిధిలోని క్వారీ వద్దకు వెళ్లాడు.
అందరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రణవ్ సాయి కొద్ది సేపు క్వారీ మధ్యలో యోగాసాలు వేసి అనంతరం నీళ్లలోకి దిగి ఈత కొడుతుండగా మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు, పోలీసులకు ప్రణవ్ సాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టి సాయి ప్రణవ్ మృతదేహాన్ని వెలికితీశారు. క్వారీలో పెద్ద ఎత్తున లోతైన గుంతలు ప్రమాదకరంగా ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి హేమలత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


