
సమగ్ర వెనుకబాటుతనం సూచిక నిర్ధారణ
242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చిన స్వతంత్ర నిపుణుల కమిటీ
పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే(ఎస్‌ఈఈఈపీసీ)– 2024 గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్ ఇచ్చింది. ఎస్‌ఈఈఈపీసీ–2024ను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను సైతం రూపొందించింది.
పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ సిద్ధమైంది. ఈ కమిటీ బుధవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖ్‌దేవ్ థారోట్, డాక్టర్ హిమాన్షు, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిటీ కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కన్వినర్లు మీడియాతో మాట్లాడారు.
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్‌ఈఈఈపీసీ–2024 అత్యంత పారదర్శకంగా, క్రమపద్ధతిలో, శాస్త్రీయంగా నిర్వహించిందన్నారు. సర్వే నివేదిక దాదాపు మూడు వందలకు పైగా పేజీల్లో ఉందని, ఆ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత కులాల వారీగా గణాంకాలను క్రోడీకరించి ప్రతికులానికి (కంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్) గ్రేడింగ్ (ర్యాంకింగ్) ఇచ్చినట్లు తెలిపారు.
దేశంలో ఇప్పటివరకు ఇలాంటి విశ్లేషణ ఏ రాష్ట్రంలో జరగలేదని, తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పక్కా గణాంకాలతో నిర్వహించిందన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించి తుది నివేదిక తయారైందని, వారం, పది రోజుల్లో ప్రభుత్వం సమయం ఇచి్చన వెంటనే నివేదికను సమర్పించనున్నట్లు వివరించారు. ఈ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరతామన్నారు.