అరెస్ట్‌ చేసిన బాలుడు ఎక్కడ? | illegal arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌ చేసిన బాలుడు ఎక్కడ?

May 1 2025 9:57 AM | Updated on May 1 2025 11:57 AM

illegal arrest in Hyderabad

పూర్తి నివేదిక సమర్పించండి

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌  

హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్‌..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్‌ 28న మహబూబ్‌నగర్‌ జిల్లా కడ్తాల్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్‌ నుంచి కాల్‌ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్‌ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.  


 

Advertisement
 
Advertisement
Advertisement