సాక్షి, నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తనకు ఎటువంటి పంచాయితీ లేదని(విభేధాలు) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నల్లగొండలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు వాటిని తొలగించాయి.. ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కోమటి రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని సూచించారు. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని ఈ సందర్బంగా కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నల్గొండలో నిర్వహించిన జాగృతి జనం బాట కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా కవిత..‘నల్లగొండ జిల్లాకు కృష్ణా నది జలాలు గత 12 ఏళ్లలో పూర్తిస్థాయిలో అందాయో లేదో పాలకులు ఆలోచించుకోవాలన్నారు. నాగార్జునసాగర్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న నాలుగైదు మండలాలకు నీళ్లే అందడం లేదని నెల్లికల్లు లిఫ్ట్ పనులే అక్కడే ఆగిపోయాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కవిత దుయ్యబట్టారు.
జీజీహెచ్ మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవని ఐసీయూలో ఒక్కో బెడ్ పై ఇద్దరు పసికందులను పడుకోబెడుతున్నారని ప్రభుత్వ నిర్లక్ష వైఖరితో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కనీసం ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ మందు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ధాన్యం కొనుగోలు వేగంగా చేపట్టాలని 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బందులు పెడుతోన్న నిబంధనలను వెంటనే సడలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


