సోలార్‌పవర్‌తో ‘హైడ్రోజన్‌’

Hydrogen with solar power - Sakshi

ఇప్పటివరకు థర్మల్‌ పవర్‌తోనే ‘హైడ్రోజన్‌’ ఉత్పత్తి 

‘గ్రీన్‌’ హైడ్రోజన్‌ సాధ్యాసాధ్యాలపై నివేదికకు ఆదేశాలు

అమల్లోకి వస్తే దేశంలోనే తొలి సంస్థగా సింగరేణికి గుర్తింపు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్‌ విద్యుత్‌ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్‌ ప్లాంట్‌ను గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై  పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) ఎన్‌.శ్రీధర్‌ సంస్థకు చెందిన విద్యుత్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు.

హైడ్రోజన్‌ అవసరం
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్‌ ఆవరణలోనే ఒక హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో ఉన్న హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్‌ మీటర్ల హైడ్రోజన్‌ వాయువును ఉత్పత్తి చేస్తోంది. 

గ్రీన్‌ హైడ్రోజన్‌
సాధారణంగా థర్మల్‌ విద్యుత్‌ వినియోగించి ఎలక్ట్రాలసిస్‌ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్‌ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్‌ విద్యుత్‌కు బదులు సోలార్‌ విద్యుత్‌ వినియోగించి హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’గా పేర్కొంటారు. సింగరేణి పవర్‌ ప్లాంట్‌లో హైడ్రోజన్‌ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్‌ థర్మల్‌ విద్యుత్‌ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్‌ బదులుగా సోలార్‌ విద్యుత్‌ ఉపయోగిస్తారు.  

జైపూర్‌లోనే...
జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ నేరుగా హైడ్రోజన్‌ ప్లాంట్‌కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్‌లోనే మరో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్‌ సూచించారు. సోలార్‌ పవర్‌ ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగిస్తున్న తొలి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. 

జియోపై దృష్టి
వేడినీటి ఊట ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోనే మిథనాల్‌ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్‌ ఆదేశించారు.  

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్‌ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశామని,  తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్‌ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్‌ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్‌కుమార్‌ సూర్, చీఫ్‌ ఓఅండ్‌ఎం జే.ఎన్‌.సింగ్, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జనరల్‌ మేనేజర్‌ చినబసివి రెడ్డి, జనరల్‌ మేనేజర్‌(సోలార్‌) జానకీరాం, చీఫ్‌ ఆఫ్‌ పవర్‌ ఎన్‌వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్‌ఎన్‌.ప్రసాద్, సుధాకర్‌ పాల్గొన్నారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top