TSRTC Launched General Route Pass in Greater Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..! తొలిసారిగా

Published Thu, May 25 2023 7:40 PM

Hyderabad Tsrtc Has Launched General Route Pass - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. 

నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్‌కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1000గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు. 

హైదరాబాద్‌లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్‌కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్‌కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్‌లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్‌ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది. 

“గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్‌ను సంస్థ ప్రారంభించింది.
చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్‌ యాజమాన్యానికి సజ్జనార్‌ రిక్వెస్ట్‌.. ట్వీట్‌తో..

రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్‌లను ఇస్తున్నాం. తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1200గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం. హైదరాబాద్‌లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్‌లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్‌లు 40 వేల వరకు ఉన్నాయి. వాటి మాదిరిగానే కొత్తగా తీసుకువచ్చిన రూట్ పాస్‌ను ప్రయాణికులు ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.

Advertisement
Advertisement