VC Sajjanar- BCCI: పునరాలోచించండి.. ఐపీఎల్‌ యాజమాన్యానికి సజ్జనార్‌ రిక్వెస్ట్‌.. ట్వీట్‌తో

VC Sajjanar Requests IPL management Do Not Promote Such Things - Sakshi

IPL 2023: టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఉన్న క్రేజ్‌ మరే ఇతర లీగ్‌కు లేదనడంలో సందేహం లేదు. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది. అదే విధంగా స్పాన్సర్ల మీద కనక వర్షం కురిపిస్తుంది. 

అయితే, నాణేనికి మరోవైపు.. ఐపీఎల్‌ క్రేజ్‌ను బెట్టింగ్‌లు, ఇతర దందాలతో దుర్వినియోగం చేస్తున్నవాళ్లు కూడా కోకొల్లలు. తాజాగా.. గొలుసుకట్ట సంస్థ హెర్బల్‌ లైఫ్‌ కూడా ఈ జాబితాలో చేరిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. ఐపీఎల్‌ అఫిషియల్‌ పార్ట్‌నర్‌గా ఉన్నామంటూ తమ ప్రాడక్టులతో అమాయక ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. 

ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదే విధంగా హెర్బల్‌ లైఫ్‌ లాంటి సంస్థలను తమ భాగస్వామిగా ప్రకటించడంపై బీసీసీఐ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుని మోసాలకు అడ్డుకట్ట వేయాలని సజ్జనార్‌ కోరారు.

ఈ మేరకు.. ‘‘హెర్బ‌ల్ లైఫ్ లాంటి గొలుసుక‌ట్టు సంస్థ‌లు అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూనే ఉన్నాయి. #IPLకు అఫిషియ‌ల్ పార్ట‌న‌ర్‌గా ఉన్నామంటూ ప్రొడ‌క్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. 

ఇలాంటి మోస‌పూరిత సంస్థ‌ల‌ను అఫిషియ‌ల్ పార్ట‌న‌ర్‌గా పెట్టుకోవ‌డంపై ఐపీఎల్ యాజ‌మాన్యం పున‌రాలోచించాలి.  హెర్బ‌ల్ లైఫ్పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుని.. మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి’’ అని వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఐపీఎల్‌-2023 నేపథ్యంలో హెర్బల్‌ లైఫ్‌ సంస్థ బీసీసీఐతో జట్టు కట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్‌లోనైనా..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top