‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ సమానత్వానికి నిలువెత్తు చిహ్నం: మోదీ

Hyderabad: Pm Narendra Modi Visits Statue Of Equality Muchintal - Sakshi

ఆయన బోధనలే భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయి

రామానుజుల మార్గం.. ఎన్నో సమస్యలకు పరిష్కారం 

ఈ స్ఫూర్తితోనే ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించే ప్రయత్నం 

216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని 

రాముడిలా మోదీ వ్రత సంపన్నుడు: చినజీయర్‌ స్వామి 

సమానత్వ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:‘‘జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ 75 ఏళ్ల  స్వాతంత్య్రాన్ని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట జరుపుకొంటున్నామని గుర్తు చేశారు.

నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. 

ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం.. ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు అన్నమాచార్యులు, కనకదాసు మొదలుకుని తులసీదాస్, కబీర్‌దాస్‌ వంటి సాధు సంతుల ఉపదేశాలు, సందేశాల ద్వారా దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగు కంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. గురువు ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయం. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలు యుగయుగాలుగా మానవాళికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నాయి. ఆ విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. 

విశిష్టాద్వైత బోధనతో.. 
అంబేడ్కర్‌ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. 

సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’.. ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్‌ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. నేడు ఆవిష్కరించిన రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది.

ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుం డా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పేదలకు పక్కాఇళ్లతోపాటు, ఉచిత గ్యాస్, రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సలు, ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు, జనధన్‌ ఖాతాలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల ద్వారా పేదలు, వెనుకబడిన వర్గాలకు మేలు కలు గుతోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. 
వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు. రామానుజాచార్యుల గురువు వేరే జాతి వ్యక్తి అంత్యక్రియలు చేస్తే వచ్చిన విమర్శలపై సమాధానమిస్తూ.. ‘రాముడు జటాయువు అంత్యక్రియలు జరిపినపుడు ఇది ఎలా తప్పు అవుతుంది?’ అని నిలదీశారు. యుగాల నుంచి పరిశీలించి చూస్తే.. చెడు విస్తరించినపుడల్లా మన మధ్య నుంచే మహానుభావులు పుట్టి.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి నిబద్ధతతో పోరాటం చేశారు. సమాజం దానిని అర్థం చేసుకున్నప్పుడు ఆదరణ లభిస్తుంది. రామానుజులు సమాజాన్ని మంచి మార్గంలో నడిపేందుకు.. ఆధ్యాత్మిక, వ్యక్తిగత జీవితాన్ని ఆచరణలో చూపారు.  తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టం చేశారు. 

ప్రధాని మోదీది రాజ ధర్మం చినజీయర్‌ స్వామి 
నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్‌ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి సంవత్సరాలకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషి చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీకి మాత్రమే ప్రధాని స్థానం సరిపోలుతుంది. ప్రజా సంక్షేమం కోసం ఏయే పనులు చేయాలో మోదీకి తెలుసు. సమయానుకూలంగా వాటిని చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రాజధర్మాన్ని అత్యంత స్పష్టంగా అమలు చేస్తున్నారు. సబ్‌కాసాత్‌– సబ్‌కా వికాస్‌ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు.    ధర్మపాలన చేసే ప్రభువు నియమనిష్టలతో ఉండాలన్నారు. 


 

సమానత్వమే మా సిద్ధాంతం: కిషన్‌రెడ్డి 
మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చినజీయర్‌ స్వామి ముచ్చింతల్‌లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ సమతా స్ఫూర్తి కేంద్రం అంతర్జాతీయ స్థాయి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుందని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం కాశీ క్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం, హైదరాబాద్‌లో రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందుతాయని చెప్పారు. దేశం మొత్తానికి 1947లోనే స్వాతంత్య్య్రం లభించినా.. మనకు (హైదరాబాద్‌ స్టేట్‌కు) ఒక ఏడాది తర్వాత స్వాతంత్య్య్రం లభించిందన్నారు. అది కూడా సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో వచ్చిందని పేర్కొన్నారు.   

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top