
10 కి.మీ.మార్గంలో సైకిల్ ట్రాక్, స్కై వాక్
గతంలోనే ప్రతిపాదనలు రూపొందించిన హెచ్‌ఎండీఏ
సీఎం కోర్ అర్బన్ అభివృద్ధి ప్రణాళికలతో మార్గం సుగమం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ సైక్లింగ్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. కోర్ అర్బన్ సుందరీకరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుస్సేన్‌సాగర్ 2.0 అంశాన్ని ప్రస్తావించారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్, సైక్లింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, నైట్‌లైఫ్ షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (హుమ్టా) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ డిజైన్‌లను రూపొందించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తాజాగా సీఎం ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మరోసారి ఇది తెరపైకి వచి్చంది. స్కైవాక్ సైకిల్‌ట్రాక్ ప్రాజెక్టు నిర్మిస్తే నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు మరిన్ని పర్యాటక హంగులతో ఆకట్టుకోనున్నాయి. శ్వేతసౌధం వంటి సచివాలయం, బాబాసాహెచ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, ఎనీ్టఆర్ గార్డెన్, లుంబినీపార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులకు ఇది మణిహారంగా మారనుంది.
దేశంలోనే మొదటిది..
హుస్సేన్‌సాగర్ అందాలను ఆకాశంలోంచి వీక్షించేందుకు అనుగుణంగా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించాలనేది ప్రతిపాదన. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ఐమాక్స్ థియేటర్ మీదుగా నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా, ట్యాంక్‌బండ్, తదితర ప్రాంతాలను కలుపుతూ ఇందిరాపార్కు వరకు స్కైవాక్ నిర్మిస్తారు. దీంతో సాగరానికి అన్ని వైపులా రాకపోకలు సాగించవచ్చు. సంజీవయ్య పార్కు, పీపుల్స్‌ప్లాజా, జలవిహార్, ఎంఎంటీఎస్ స్టేషన్, లేక్‌వ్యూపార్కు, ఎనీ్టఆర్ పార్కు, లుంబిని పార్కు, సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం తదితర సందర్శనీయ స్థలాలను ఆకాశ నడకతోలోనే చేరుకోవచ్చు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి స్కైవాక్‌లు లేవని, హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేయనున్నదే మొట్టమొదటి స్కైవాక్ కానుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించనుందని పేర్కొన్నారు.
వాకింగ్‌తో పాటే సైక్లింగ్..
సాగర్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న స్కైవాక్‌పైకి చేరుకొనేందుకు, కిందకు దిగేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రవేశ, ని్రష్కమణ దారులు ఉంటాయి. స్కైవాక్ మొత్తం 5.5 మీటర్ల వెడల్పు ఉంటుంది.ఇందులో 3 మీటర్లు సైకిల్ ట్రాక్ కోసం కేటాయిస్తారు.సైకిలిస్టులు ఈ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు.
0.5 మీటర్ల వెడల్పుతో ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన సెంట్రల్ మీడియన్ ఉంటుంది. దానిని ఆనుకొని 2 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో సందర్శకులు ఒకే ట్రాక్‌పైన నడిచేందుకు, సైకిలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ట్రాక్‌కు రెండు వైపులా గ్రీనరీని ఏర్పాటు చేస్తారు.
కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు కూడా స్కైవాక్‌ను వినియోగించుకోవచ్చు.
సుమారు రూ.200 కోట్లతో అంచనాలు...
హుస్సేన్‌సాగర్ చుట్టూ నిర్మించనున్న స్కైవాక్‌కు ఒక కిలోమీటర్‌కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం 10 కిలోమీటర్ల మార్గానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.ప్రాజెక్టులో భాగంగానే హుస్సేన్‌సాగర్‌లో నీటిపై తేలియాడే బాస్కెట్‌బాల్ కోర్టు, క్రికెట్ స్టేడియం వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం సింగపూర్‌లో ఈ తరహా వేదికలున్నట్లు అధికారులు తెలిపారు.
ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా షాపింగ్ కేంద్రాలు, రెస్టారెంట్లు వంటివి కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.