
మొత్తం 10 పార్కింగ్ అంతస్తులు, సినిమా థియేటర్లు
దేశంలోనే తొలి ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్
ప్రభుత్వ శాఖల అనుమతి లభించగానే ప్రారంభం
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోరైల్ నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే ఈ తరహా పార్కింగ్ ప్రాజెక్ట్ తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్మాణం కావడం విశేషం. త్వరలో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోందని, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి లభించిన వెంటనే అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ఆయన నాంపల్లిలోని మెట్రో పార్కింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. నగరంలో పార్కింగ్ కష్టాలను తీర్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టుకుగా ఇది వినియోగంలోకి రానుంది. ప్రపంచంలోనే ఇలాంటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు ఎంతో అరుదుగా ఉన్నట్లు ఎన్వీఎస్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఈ ప్రాజెక్టును అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించామన్నారు.
పార్కింగ్ ప్రత్యేకతలివీ..
హైదరాబాద్ మెట్రోరైల్ ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టింది. ‘నోవమ్’ అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఇది జర్మనీకి చెందిన అత్యాధునిక ‘పాలిస్‘ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్‌గా నిర్మితమైంది. ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్ 2000 చ.గ స్థలాన్ని 50 సంవత్సరాల కన్సెషన్‌కు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు డెవలపర్లు డాక్టర్ హరికిషన్ రెడ్డి, భావనారెడ్డిలు రూ.102 కోట్లతో నిర్మించారని ఎన్వీఎస్ తెలిపారు.
ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో 3 బేస్‌మెంట్లు, 7 పైఅంతస్తులు కలిపి మొత్తం 10 అంతస్థుల్లో పార్కింగ్ సదుపాయం ఉంటుంది. మరో 5 అంతస్తులను వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించారు. ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌లో అన్నిరకాల సదుపాయాలు కలిగిన రెండు సినీ థియేటర్లను కూడా ఏర్పాటు చేశారు. 11వ అంతస్తులో నగర వీక్షణ కోసం గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 10 పార్కింగ్ అంతస్తుల్లో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా నగర ప్రజలకు ప్రపంచ స్థాయి పార్కింగ్ అనుభవం అందించనున్నామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
India’s First Fully Automated, Ultra-Modern Parking Project
Hyderabad Metro Rail Ltd is giving final touches to a remarkable project aimed at addressing the city’s parking woes. HMRL Managing Director Mr. @NVSReddyIRAS announced that a rare, fully automated multi-level… pic.twitter.com/DeOJQj0aXe— Jacob Ross (@JacobBhoompag) August 10, 2025