బాధితులతో రాయ‘బేరాలు’

Hyderabad Corporate Hospitals Phone Calls Foe Cancel Cases - Sakshi

కోవిడ్‌ చికిత్సల పర్మిషన్‌ రద్దయిన ఆస్పత్రుల కొత్త ఎత్తు 

ఫిర్యాదు చేసిన వారందరికీ ఫోన్లు 

వెనక్కి తీసుకుంటే... ఫీజులో కొంత వాపస్‌ చేస్తామని బేరాలు

సాక్షి,సిటీబ్యూరో: నియమాలు ఉల్లంఘించి కరోనా చికిత్సపై కాసులు ఏరుకుంటున్న కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు మరో అడుగు ముందుకు వేశాయి. తమ నిర్వాకాలపై ఫిర్యాదు చేసిన బాధితులను నయానో, భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డాయి. ఇటీవల కరోనా చికిత్సలు చేయకుండా అనైతిక చర్యలకు పాల్పడటంతో క్రమశిక్షణా చర్యలకు గురైన ఆసుపత్రుల  ప్రతినిధులు ఫిర్యాదుదారులను దారిలోకి తెచ్చే పనులకు దిగారు. తమ ఆస్పత్రి వైద్యం, బిల్లులు, అనైతిక చర్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వారికి ఫోన్‌ చేయడంతో పాటు వాళ్లను నేరుగా కలుస్తున్నారు.  ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే అధిక బిల్లు విషయంలో చర్చిద్దామని రాజీ భేరాలు చేస్తున్నారు.  (‘విరించి’పై వేటు!)

కోవిడ్‌ వ్యాధి కోసం రోడ్‌ నంబర్‌–1లోని ఓ ఆస్పత్రిలో చేరి రూ.14.60 లక్షల బిల్లులు చెల్లించిన ఓ వృద్ధ దంపతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరితో ఆస్పత్రి నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్న వ్యక్తి సంప్రదింపులు జరిపి ఫిర్యాదును ఉపసంహరించుకుంటే తాము కట్టించుకున్న ఫీజులో కొంత వాపస్‌ చేసే విషయమై మాట్లాడతామని ప్రతిపాదన పెట్టాడు. దీంతో వారు వెంటనే ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అనంతరం సంబంధిత ఆస్పత్రి ప్రతినిధి ఎంతకూ ఫోన్‌ లేపకుండా తమని మరోసారి వంచనకు గురి చేశాడని ఆ వృద్ధ దంపతులు మీడియాను ఆశ్రయించారు. తమను రెండుసార్లు మోసం చేసిన సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఆస్పత్రి ప్రతినిధిని ‘సాక్షి’ ప్రశ్నిస్తే ‘‘మాకు జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. వివాదం కోర్టులో ఉంది’’ అని పేర్కొనడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top