Hyderabad City Bus: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’

Hyderabad: Complaints On RTC Bus Drivers Conductors Are Not Wearing Mask - Sakshi

ఆర్టీసీలో నిబంధనలు పాటించడంలేదంటూ ఆరోపణలు

డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదని  ఫిర్యాదులు

ఇటీవల తనిఖీలు నిర్వహించిన ఎండీ సజ్జనార్‌

రెండ్రోజుల్లో పెరగనున్న తిరుగు ప్రయాణాల రద్దీ

బస్సుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్‌: ‘సిటీబస్సుల్లో ప్రయాణికులు మాస్కులు ధరించి ప్రయాణం చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు మాత్రం మాస్కులు సరిగా ధరించడం లేదు.ఇది ఇబ్బందిగా ఉంది’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే ఆర్టీసీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సంక్రాంతి రద్దీ సమయంలో స్వయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో తనిఖీలు సైతం నిర్వహించారు. ప్రయాణికులు, కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌లో ఈ  ఆదేశాలు పెద్దగా అమలుకు నోచుకోవడం లేదు. యథావిధిగా కండక్టర్లు, డ్రైవర్లు మాస్కులు సరైన పద్ధతిలో ధరించకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

రోజుకు 20 లక్షల మంది ప్రయాణం.. 
రెండు రోజులగా సంక్రాంతి దృష్ట్యా సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. సాధారణంగా రోజుకు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. కోవిడ్‌ రెండో ఉద్ధృతి అనంతరం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో సిటీ బస్సుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో పలు మార్గాల్లో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి బస్సులో ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్‌ వేగంగా వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. 
చదవండి: సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన 

ప్రయాణికులతో పాటు, డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్‌లతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కోవిడ్‌ ఆరంభంలో ఈ దిశగా ఆర్టీసీ విస్తృత స్థాయిలో అవగాహన కల్పించింది. ప్రయాణికులను, సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేసింది. బస్సులను సైతం పూర్తిగా శానిటైజ్‌ చే శారు. కానీ మూడో ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడ ంపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

మెట్రో రైల్‌ తరహాలో నియంత్రణ.. 
మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటే మాస్కు తప్పనిసరిగా ఉండాల్సిందే. మాస్కులేని ప్రయాణికులను గుర్తించి అవగాహన కల్పించేందుకు ఇటీవల మెట్రో రైళ్లలో తనిఖీలను విస్తృతం చేశారు. సిటీ బస్సుల్లోనూ ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా డిపో స్థాయి అధికారులు అవగాహన చర్యలు చేపట్టడం మంచిది.
చదవండి: Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు   

పెరగనున్న రద్దీ.. 
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన నగరవాసులు రానున్న రెండు రోజుల్లో తిరిగి నగరానికి చేరుకోనున్నారు. దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకొనే ప్రయాణికులతో సిటీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. మాస్కుల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ మాస్కులను కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించడం ఒకటే పరిష్కారం అని వైద్యులు సూచిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top