
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని.. ఎక్కడ చూసినా అవినీతిమయంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి శరవేగంగా పడిపోతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ చెప్తున్న అబద్ధాలతో దేశం పరువు పోతోందని.. బీజేపీ పోతేనే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరు, ప్రధాని మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు జాతీయ అంశాలు, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
విద్యుత్ సంస్కరణల పేరిట రాజ్యాంగ ఉల్లంఘన
మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. విద్యుత్ సంస్కరణల బిల్లు ఆమోదం పొందక ముందే అమలు చేయడం పార్లమెంటుకు అవమానం. ప్రతిపాదిత సంస్కరణలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే.. ఐదేళ్లపాటు 0.5 శాతం అదనపు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఏడాదిలోపు అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంతోపాటు మూడేళ్లలో అన్ని కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని చెప్తోంది. కేంద్రం ఒత్తిడితో పొరుగు రాష్ట్రంలో ఇప్పటికే 25వేల మీటర్లు పెట్టారు. అదనపు ఎఫ్‌ఆర్‌బీఎంతో రాష్ట్రానికి ఏటా రూ.5వేల కోట్లకుపైగా అదనంగా నిధులు అందుతాయి. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోయినా సరేనని.. రాష్ట్రంలో వ్యవసాయానికి మీటర్లు పెట్టబోమని తెగేసి చెప్పాం. సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలు, బార్బర్ షాప్‌లు, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర రంగాలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలపై ప్రభావం పడుతుంది.
విద్యుత్ రేట్లపై పచ్చి అబద్ధాలు
గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విద్యుత్ ధరలపై పచ్చి అబద్ధాలు చెప్పారు. యూనిట్ విద్యుత్‌ను రూపాయి పది పైసలకే ఇస్తున్నామని చెప్పి దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో 40వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు వాటిలో ఉత్పత్తి జరపడం లేదు. పైగా బీజేపీకి చందాలు ఇచ్చే వారి కోసం సౌర విద్యుత్ కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. తెలంగాణలో 2,500 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులో ఉన్నా.. సోలార్ పవర్ కొనాలంటున్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వొద్దంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. సింగరేణిని కూడా రక్షించుకోవాలి. కేంద్రానికి అంతగా ఇష్టం లేకుంటే మీ వాటా 49శాతం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామని ఇప్పటికే చెప్పాం.
బీజేపీ అబద్ధాలతో పరువుకు దెబ్బ
వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారంతో దేశం పరువు పోతోంది. దేశంలోని రాజకీయ పార్టీలు, నాయకులకు వ్యతిరేకంగా విష ప్రచారం జరుగుతోంది. వీటిపై హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ అబద్ధాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. ఆయన అసలు రూపాన్ని బయటపెడుతూ అనేక పుస్తకాలు వస్తున్నాయి.
దొంగలను దేశం దాటించడమే దేశభక్తా?
మోదీ ప్రభుత్వం పేదలకు సబ్సిడీ బంద్ పెట్టి గజదొంగలకు పంచిపెట్టింది. బీజేపీ çహయాంలో 33 మంది ఆర్థిక నేరస్తులు సీబీఐ కేసులు పెట్టిన తర్వాత విదేశాలకు పారిపోయారు. లండన్‌లో పిక్నిక్ చేసుకుంటున్నరు. వాళ్లంతా మోదీ దోస్తులే. గుజరాతీలే. మీ దేశభక్తికి ఇదా తార్కాణం?
గెలవకున్నా సిగ్గులేకుండా పరిపాలన
ప్రజా నిర్ణయాలను గౌరవించే సంస్కారం లేని అప్రజాస్వామికమైన ప్రభుత్వం మోదీది. ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి. ఓడిపోతే అంగీకరించకపోవడం. ఈడీ, సీబీఐని దింపడం. మందిని ఆగమాగం చేయడం. ఎన్నికల్లో గెలవకపోయినా పాలన చేసే సిగ్గులేని ఒకే ఒక పార్టీ బీజేపీ. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్‌లో గెలవకున్నా పరిపాలిస్తున్నరు. మహారాష్ట్రలో ఆ పని చేయబోయి పరువు తీసుకున్నరు.
తప్పు చేయడం.. క్షమాపణలు కోరడం..
యూపీ ఎన్నికల్లో డబ్బాల్లో ఓట్లు పడిన తెల్లారే పెట్రోల్ ధరలు పెంచుతరు. వాళ్ల ఏ విధానం బాగోలేదు. వ్యవసాయ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకున్నరు? రైతులకు క్షమాపణ ఎందుకు చెప్పారు? ప్రధాని మోదీకి క్షమాపణ కోరే అలవాటుంది. ప్రధాని అయితే గోద్రా అల్లర్లు వంటివి దేశంలో కూడా చేస్తావా అని జనం అడిగితే.. అప్పుడు ముస్లింలను క్షమాపణ కోరిండు. దేశంలో మళ్లీ అలా జరగవని చెప్పిండు.
మతం పేరుతో ద్వేషపు మంటలు
బీజేపీ వాళ్లు వాడే భాష అత్యంత బాధాకరం. దేశంలో ఎవరినీ గౌరవించరు. తిడ్తరు. దూషిస్తరు. మన బెంగళూరు, కర్ణాటకలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాలి. అక్కడ యువతీయువకులను ద్వేషం నేర్పుతున్నారు. దేశం ఎక్కడికిపోతోంది? ఇలాంటివి ప్రేరేపిస్తే ఏమవుతుంది? కర్ణాటకలోని దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా చెలరేగితే పరిస్థితితేమిటి? ఏడేళ్లు కష్టపడి తెలంగాణలో అభివృద్ధి, సామరస్యత తీసుకువచ్చాం. పెట్టుబడులు, ఉద్యోగవకాశాలు పెరిగాయి. ఇంత మంచి వాతావరణం మత ఘర్షణలతో దెబ్బతింటే ఇక్కడ పెట్టుబడులకు ఎవరొస్తారు? కాంగ్రెస్ వాళ్లందరూ అర్బన్ నక్సలైట్లుగా మారారని అని సాక్షాత్తు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చెప్పేవరకు ఈ ద్వేషంవెళ్లింది.
క్షమాపణ చెప్పాల్సిందే..
రాహుల్‌గాంధీ తాత దేశ స్వాతంత్య్రం కోసం ఏళ్ల తరబడి జైళ్లలో గడిపారు. వాళ్ల నాయనమ్మ (ఇందిరా గాంధీ), తండ్రి (రాజీవ్ గాంధీ) దేశం కోసం ప్రాణాలిచ్చారు. అలాంటి చరిత్ర గల కుటుంబాన్ని పట్టుకుని అసోం సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఈ విషయంలో క్షమాపణ చెప్పే వరకు బీజేపీని వెంటాడుతాం. ఇది బీజేపీ సంస్కృతా? ఏ తండ్రికి పుట్టావు వంటి మాటలను బీజేపీ ఎలా ప్రోత్సహిస్తది? కాంగ్రెస్‌తో పొత్తు కోసం కాదు ఇది అంటున్నది. రాహుల్‌గాంధీపై వేసిన నిందను వ్యతిరేకించిన. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై ఇప్పుడే ఊహించలేను. గవర్నర్ల వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పింది. బీజేపీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. నా ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కరోనా బారినపడటంతోనే రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లలేదు.
రఫేల్‌పై సుప్రీంలో కేసుపెడతాం!
నన్ను జైలుకు పంపిస్తామంటున్నారు. రండి.. దమ్ముంటే జైల్లో వేయాలి? అవినీతి, అక్రమ సంపాదన చేసినోడికి భయం. నువ్వు మమ్మల్ని వేసేదేంది? మిమ్మల్ని వేసేది పక్కా. భయంకరమైన అవినీతి చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడ్తం. రఫేల్ డీల్‌పై రాహుల్ గాంధీ మాట్లాడితే తప్పుపట్టారు. క్లీన్‌చిట్ తీసుకున్నట్టు చెప్పుకున్నరు. ఇన్నేళ్లకు అసలు దొంగతనం బయటపడుతోంది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వం వేల కోట్లు దిగమింగింది. మన దేశం 36 రఫేల్ జెట్స్‌ను మన దేశం 9.4 బిలియన్ డాలర్లకు కొంటుంటే.. నిన్న ఇండోనేషియా 42 రఫేల్ జెట్లను 8 బిలియన్ డాలర్లకే కొన్నది. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవరు జైలుకు వెళ్లాలో వారు వెళ్లాలి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. ఇదొక్కటే కాదు చాలా ఉన్నయి నా దగ్గర.
మోదీది తుపాకీ రాముడి ప్రగతి
2025 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుందని వడ్డీ వ్యాపారులు, గుమస్తాలు కూడా లెక్కలు చెప్పగలరు. మోదీది తుపాకీ రాముడి ప్రగతి. దేశాన్ని నడిపే పద్ధతి ఇదికాదు. ప్రధానికి వినూత్న నైపుణ్యాలు, మంచి ప్రభుత్వం ఉంటే.. చైనా, సింగపూర్ తరహాలో అభివృద్ధి సాధించండి. బీజేపీని తరిమి కొడితే దేశం బాగుపడతుంది.
యాదాద్రికి పిలవడంపై ఆలోచిస్తాం
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని చాలా దుర్మార్గమైన కామెంట్ చేశారు. తెలంగాణ, ఏపీని ఆదుకున్నది మాత్రం లేదు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించే అంశంపై ఆలోచిస్తాం.