
దేశ విదేశాల్లోని నగరాల్లో అధ్యయనం
త్వరలో కన్సల్టెన్సీ నియామకం
ట్రిపుల్ ఆర్ దాకా మహా నగర విస్తరణకు మార్గదర్శనం
ఆసక్తిగల సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ స్వీకరణ
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ రంగానికి సరికొత్త దిశా నిర్దేశం చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా సమగ్ర బిల్డింగ్ బైలాస్ (Building Bye Laws) రూపకల్పనకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పలు దేశ విదేశాలకు చెందిన మెట్రోపాలిటన్ నగరాల్లోని బిల్డింగ్ బైలాస్‌పై అధ్యయనం చేసి మహా నగర అవసరాలకు అనుగుణంగా బైలాస్‌ను (నియమ, నిబంధనలు) రూపకల్పన చేసేందుకు ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను స్వీకరించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
మహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్‌రోడ్డు (Regional Ring Road) వరకు మౌలిక, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ, పచ్చదనం పెంపు, నీటివనరుల సంరక్షణ తదితర అంశాలపై మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన నిర్మాణాలకు శాస్త్రీయమైన బైలాస్‌ను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేపట్టింది. దీనివల్ల నిర్మాణ సంస్థలకు అనుమతులను అందజేయడంలో అనవసరమైన జాప్యాన్ని నివారించడమే కాకుండా అడ్డదిడ్డ నిర్మాణాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆకాశ హర్మ్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు..
నగరంలో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. గత పదేళ్లుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. ప్రస్తుతం 57 నుంచి 65 అంతస్తుల హైరైజ్ భవనాలు నిర్మాణమవుతున్నాయి. అదేక్రమంలో విశాలమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు విస్తరిస్తున్నాయి. కానీ కచ్చితమైన నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఒక భవనానికి మరో భవనానికి ఒకేలా నిబంధనలు అమలు కావడం లేదు. మరోవైపు డీవియేషన్స్ సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి. హెచ్‌ఎండీఏ (HMDA) అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి డీవియేషన్‌లను (ఉల్లంఘనలను) గుర్తించినపప్పటికీ వాటిని సవరించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు ఈ ఉల్లంఘనల వల్ల అనుమతులను ఇవ్వడంలో కూడా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్డింగ్ బైలాస్ రూపకల్పనపై దృష్టి సారించారు.
వివిధ నగరాలపై అధ్యయనం..
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బిల్డింగ్ బైలాస్ అమల్లో ఉన్నాయి. నివాస భవనాలకు, వ్యాపార, వాణిజ్య భవనాలకు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి భవనాలకు ప్రామాణికమైన నిబంధనలను పాటిస్తున్నారు. భవనాల నిర్మాణం, భద్రత, పర్యావరణ పరిరక్షణ,నగర అభివృద్ధి వంటి అంశాలను లక్ష్యాలుగా చేసుకొని ఈ నిబంధనలు రూపొందించారు.ఇందుకోసం ముంబయిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ), ఢిల్లీలో ఫ్లోర్ రేషియో ఏరియా (ఎఫ్‌ఏఆర్) వంటి ప్రామాణికమైన పద్ధతులను అమలు చేస్తున్నారు. నిర్మాణ వైశాల్యం, ప్లాట్ వైశాల్యం ఏ విధంగా ఉండాలనేది ఈ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
చదవండి: హైదరాబాద్‌లో ఇక పక్కాగా 'వరద' నివారణ
ఒక్కో ప్రాంతంలో ఎఫ్‌ఎస్‌ఐ ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ ముంబైలో ఎఫ్‌ఎస్‌ఐ 1.33 శాతం ఉంటే, సబర్బన్ ప్రాంతాల్లో 2.7 శాతం, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 5.32 శాతం చొప్పున ఉంది. ఢిల్లీలోనూ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎఫ్‌ఏఆర్‌ను నిర్ణయించారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లో నిర్దిష్టమైన ప్రమాణాలు రూపొందించాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. భవనం చుట్టూ ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్), భవనం ఎత్తు, ఓపెన్ స్పేస్ ఏరియా వంటివి కూడా కచ్చితమైన ప్రమాణాలతో రూపొందించాలి. అలాగే.. జపాన్, అమెరికా, యూరప్ దేశాల్లోని బిల్డింగ్ బైలాస్‌పైనా అధ్యయనం చేసి ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాల కంటే మరింత మెరుగైన ప్రమాణాలను, నియమ నిబంధనలను రూపొందించేందుకు కసరత్తు జరుగుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
తుది దశలో మాస్టర్‌ప్లాన్..
రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేపట్టింది. ముసాయిదా ప్రణాళికలను త్వరలో ప్రకటించనున్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రణాళికలు తుదిదశలో ఉన్నాయని, వచ్చే సెప్టెంబర్ నాటికి ముసాయిదా అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.