
జపాన్ నిధులతో పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం
రూ.5135 కోట్ల జైకా రుణం కోసం ప్రతిపాదనలు
ఆధునిక పద్ధతుల్లో నాలాల నిర్మాణం.. భూగర్భంలోనూ నిర్మించే అవకాశం
జపాన్‌లో చేపట్టిన అండర్ గ్రౌండ్ డిశ్చార్జి టన్నెల్ తరహాలో నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో వానొస్తే రోడ్లు, కాలనీలు అని తేడా లేకుండా వరద నీరు ముంచెత్తుతోంది. ప్రతి వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వర్షాకాలంలో ముంపు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. నగరంలో వరదనీటి కాలువల (నాలాల) సమస్య వల్లే ఈ పరిస్థితులని గుర్తించిన యంత్రాంగం వాటి ఆధునికీకరణ పనులు చేపట్టింది. 2000 సంవత్సరంలో ముంపు అనుభవాలతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) కింద మొదటి దశలో రూ.985 కోట్ల పనుల్ని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఆ పనులు 80 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సమస్యలు, కోర్టు కేసుల వంటి అవాంతరాలతో మిగతా పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో దశ కింద కూడా కొన్ని పనులు చేపట్టారు.
నిధుల కోసం..
ఈ పనులు చేయాల్సిన జీహెచ్‌ఎంసీ ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్‌డీపీ), తదితర పనుల కోసం చేసిన రుణాలకే ఏటా భారీ నిధులు మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీకి వరదనివారణ ప్రాజెక్టులకు రుణాలిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రుణం పొందాలని భావించింది. వరద నివారణ పనులకు మన కరెన్సీలో రూ.5135.15 కోట్ల మేర రుణం కోసం జీహెచ్‌ఎంసీ పంపిన ప్రతిపాదనకు జైకా నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జైకా ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నిధులందనున్నాయి.
ఏయే పనుల కోసం..
వరద నివారణ చర్యల్లో భాగంగా వరద కాలువల (నాలాల) ఆధునికీకరణ, కొత్త వరద కాలువల నిర్మాణం, చెరువుల పరిరక్షణ, సుందరీకరణల కోసం ఈ నిధులు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కాలపరిమిది దాదాపు ఎనిమిదేళ్లు. ఇందులో జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకే దాదాపు ఏడాది పట్టనున్నట్లు సమాచారం. అనంతరం లోన్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకం, పనుల డిజైన్లు, టెండర్లు, కాంట్రాక్టరు ఎంపిక వంటివి పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్ల వరకు పట్టనున్నట్లు తెలుస్తోంది. జైకా నుంచి అందే రుణం (రూ.5135.15 కోట్లు)తో హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్‌యూఏ) వరకు 450 కి.మీ.ల మేర వరదకాలువల ఆధునీకరణ, కొత్తవాటి నిర్మాణం, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం తదితరమైనవి చేయనున్నారు. ఓఆర్‌ఆర్ వరకు ప్రాంతాన్ని హెచ్‌యూఏగా వ్యవహరిస్తున్నారు.
2036 విజన్‌తో..
హెచ్‌యూఏ (HUA) పరిధి వరకు ప్రస్తుత జనాభా 1.40 కోట్లు కాగా, 2036 నాటికి ఇది 2 కోట్లకు చేరుకోనుందనే అంచనాతో ఈ ప్రతిపాదన రూపొందించారు. వరద నివారణ చర్యల కోసం ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, యుటిలిటీస్ వంటివి దెబ్బతినకుండా ఉంటాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
భూగర్భ సొరంగాలుగా..
వరద సాఫీగా ప్రవహించేందుకు వరద కాలువల (నాలాలు) నిర్మాణాలకు ఎలాంటి ఆధునిక సాంకేతికత వినియోగించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, జపాన్ తరహాలో భూగర్భ సొరంగాల మాదిరిగా వరద నీరు మళ్లించే నిర్మాణాలు చేయాలనే యోచనలో అధికారులున్నారు. జపాన్ (Japan) రుణం తీసుకోనుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇటీవల జపాన్‌లో పర్యటించి రావడం తెలిసిందే.
ఎన్ని కాలువలు ఉన్నా..
నగరంలో 13 మేజర్ వరద కాలువలు, 150కి పైగా చిన్న, మధ్య తరహా చెరువులు, మూడు పెద్ద చెరువులు (హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్) ఉన్నప్పటికీ 2020లో వచ్చిన వరదలో జరిగిన భారీ నష్టంతో, మున్ముందు సదరు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్‌ఎన్‌డీపీ కింద పనులు చేపట్టారు.
చదవండి: అనుమతులు లేక స్తంభించిన స్థిరాస్తి లావాదేవీలు..
జపాన్‌లో అలా..
జపాన్‌లో టోక్యో శివార్లలోని మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జి టన్నెల్ తరహాలో నగరంలో వరద నీటి పరిష్కారానికి అవకాశముంటుందా అనే దిశలో అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే అందుకు తగిన సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జి–కేన్స్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందిన అది ప్రపంచంలోనే అత్యంత భారీ వరద నీటిని మళ్లించే సొరంగమార్గం ప్రాజెక్ట్. దాని పొడవు 6.3 కిలోమీటర్లు. భూమి కింద 22 మీటర్ల లోతున నిర్మించారు. 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో ఒక్కొక్కటి 500 టన్నుల బరువైన 59 రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ స్తంభాలతో భారీ నీటి నిల్వ ట్యాంక్ నిర్మించారు. 78 పంపుల ద్వారా సెకనుకు 200 మెట్రిక్ టన్నుల నీటిని నదిలోకి మళ్లించే సామర్ధ్యం ఉంది. ఐదు ప్రాంతాల్లో నీటి నియంత్రణ ఏర్పాట్లున్నాయి.