breaking news
Sewage Canal
-
హైదరాబాద్‌లో ఇక పక్కాగా 'వరద' నివారణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో వానొస్తే రోడ్లు, కాలనీలు అని తేడా లేకుండా వరద నీరు ముంచెత్తుతోంది. ప్రతి వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వర్షాకాలంలో ముంపు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. నగరంలో వరదనీటి కాలువల (నాలాల) సమస్య వల్లే ఈ పరిస్థితులని గుర్తించిన యంత్రాంగం వాటి ఆధునికీకరణ పనులు చేపట్టింది. 2000 సంవత్సరంలో ముంపు అనుభవాలతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) కింద మొదటి దశలో రూ.985 కోట్ల పనుల్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఆ పనులు 80 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సమస్యలు, కోర్టు కేసుల వంటి అవాంతరాలతో మిగతా పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో దశ కింద కూడా కొన్ని పనులు చేపట్టారు. నిధుల కోసం.. ఈ పనులు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ), తదితర పనుల కోసం చేసిన రుణాలకే ఏటా భారీ నిధులు మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీకి వరదనివారణ ప్రాజెక్టులకు రుణాలిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రుణం పొందాలని భావించింది. వరద నివారణ పనులకు మన కరెన్సీలో రూ.5135.15 కోట్ల మేర రుణం కోసం జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనకు జైకా నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జైకా ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నిధులందనున్నాయి. ఏయే పనుల కోసం.. వరద నివారణ చర్యల్లో భాగంగా వరద కాలువల (నాలాల) ఆధునికీకరణ, కొత్త వరద కాలువల నిర్మాణం, చెరువుల పరిరక్షణ, సుందరీకరణల కోసం ఈ నిధులు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కాలపరిమిది దాదాపు ఎనిమిదేళ్లు. ఇందులో జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకే దాదాపు ఏడాది పట్టనున్నట్లు సమాచారం. అనంతరం లోన్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకం, పనుల డిజైన్లు, టెండర్లు, కాంట్రాక్టరు ఎంపిక వంటివి పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్ల వరకు పట్టనున్నట్లు తెలుస్తోంది. జైకా నుంచి అందే రుణం (రూ.5135.15 కోట్లు)తో హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్‌యూఏ) వరకు 450 కి.మీ.ల మేర వరదకాలువల ఆధునీకరణ, కొత్తవాటి నిర్మాణం, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం తదితరమైనవి చేయనున్నారు. ఓఆర్ఆర్ వరకు ప్రాంతాన్ని హెచ్యూఏగా వ్యవహరిస్తున్నారు. 2036 విజన్‌తో.. హెచ్‌యూఏ (HUA) పరిధి వరకు ప్రస్తుత జనాభా 1.40 కోట్లు కాగా, 2036 నాటికి ఇది 2 కోట్లకు చేరుకోనుందనే అంచనాతో ఈ ప్రతిపాదన రూపొందించారు. వరద నివారణ చర్యల కోసం ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, యుటిలిటీస్ వంటివి దెబ్బతినకుండా ఉంటాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భూగర్భ సొరంగాలుగా.. వరద సాఫీగా ప్రవహించేందుకు వరద కాలువల (నాలాలు) నిర్మాణాలకు ఎలాంటి ఆధునిక సాంకేతికత వినియోగించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, జపాన్ తరహాలో భూగర్భ సొరంగాల మాదిరిగా వరద నీరు మళ్లించే నిర్మాణాలు చేయాలనే యోచనలో అధికారులున్నారు. జపాన్ (Japan) రుణం తీసుకోనుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇటీవల జపాన్‌లో పర్యటించి రావడం తెలిసిందే. ఎన్ని కాలువలు ఉన్నా.. నగరంలో 13 మేజర్ వరద కాలువలు, 150కి పైగా చిన్న, మధ్య తరహా చెరువులు, మూడు పెద్ద చెరువులు (హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్) ఉన్నప్పటికీ 2020లో వచ్చిన వరదలో జరిగిన భారీ నష్టంతో, మున్ముందు సదరు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టారు. చదవండి: అనుమతులు లేక స్తంభించిన స్థిరాస్తి లావాదేవీలు..జపాన్‌లో అలా.. జపాన్‌లో టోక్యో శివార్లలోని మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జి టన్నెల్ తరహాలో నగరంలో వరద నీటి పరిష్కారానికి అవకాశముంటుందా అనే దిశలో అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే అందుకు తగిన సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జి–కేన్స్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందిన అది ప్రపంచంలోనే అత్యంత భారీ వరద నీటిని మళ్లించే సొరంగమార్గం ప్రాజెక్ట్. దాని పొడవు 6.3 కిలోమీటర్లు. భూమి కింద 22 మీటర్ల లోతున నిర్మించారు. 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో ఒక్కొక్కటి 500 టన్నుల బరువైన 59 రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ స్తంభాలతో భారీ నీటి నిల్వ ట్యాంక్ నిర్మించారు. 78 పంపుల ద్వారా సెకనుకు 200 మెట్రిక్ టన్నుల నీటిని నదిలోకి మళ్లించే సామర్ధ్యం ఉంది. ఐదు ప్రాంతాల్లో నీటి నియంత్రణ ఏర్పాట్లున్నాయి. -
మురుగునీటి కాలువలో దిగి ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన
సాక్షి, నెల్లూరు: అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షానే సమస్యలపై పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్‌లోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో గత ఎంతో కాలంగా ఉన్న మురుగు నీటి కాలువ సమస్యపై ఆయన మంగళవారం తీవ్రస్థాయిలో స్పందించారు. నగరపాలక సంస్థ, రైల్యే అధికారుల నిర్లక్ష్యానికి స్థానిక ప్రజలు పడుతున్న మురికి నీటి కష్టాలకు ఆయన చలించిపోయారు. మురుగు కాలువలోకి దిగి సమస్య పరిష్కారమయ్యే వరకు తాను అక్కడే ఉంటానని బైఠాయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూరల్ రోడ్ల పునరుద్ధరణకు రూ.62 కోట్లు మంజూరు చేశారని, కానీ ఈ ప్రాంతంలో మురికి కాలువ సమస్యపై మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయా శాఖల అధికారుల్లో స్పందన కరువైందన్నారు. నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకి హామీ ఇవ్వడంతో ఆయన కాలువలో నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 15వ తేదీ కాలువ నిర్మాణ పనులు చేపట్టి నెలలోపు పనులు పూర్తి చేస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పారు. 25వ తేదీ లోపు తాము కూడా పనులు పూర్తి చేస్తామని రైల్వే శాఖ అదికారులు హమీ ఇచ్చారు. సమస్యకు ఓ పరిష్కారం దొరకడంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
మురుగు కాల్వలో పసికందు మృతదేహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు రోడ్డు మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే ఆ ప్రాంతానికి సమీపంలో మరో పసికందు మృతదేహం మురుగు కాల్వలో కనిపించటం కలకలం రేపింది. పల్నాడు రోడ్డు పాత చెక్‌పోస్టు వీధిలోని ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని వన్‌టౌన్ పోలీసులకు అందించారు. దీంతో ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైడుకాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. నెలలు నిండని శిశువుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 20 రోజుల క్రితం పల్నాడు బస్టాండ్ ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాల ఎదుట ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల్లో అబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన మరువక ముందే మురుగు కాల్వలో మరో పసికందు ప్రత్యక్షమవ్వటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
అదితి క్షేమంగా ఉంటుంది!
కుటుంబ సభ్యుల ఆశాభావం సీతమ్మధార: మురుగు కాల్వలో కొట్టుకుపోయిందని భావిస్తున్న ఆరేళ్ల చిన్నారి అదితి అచూ కి నాలుగు రోజులైనా లభించకపోవడంతో కు టుంబ సభ్యుల్లో చిన్నారి సజీవంగా ఉండే ఉం టుందని ఆశలు చిగురిస్తున్నాయి. ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అదితి తాతయ్య చాడా వెంకటరమణమూర్తి తన మనోభావాలు పంచుకున్నారు. చిన్నారి పూర్తి పేరు సిహెచ్ సాయి లావణ్య అదితి అని, నాలుగేళ్లుగా సీతమ్మధారలోని తన నివాసంలోనే ఉంటూ చదువుకుంటోందని తెలిపారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండేదని, మంచి తెలివైనదని, అలాంటి బాలిక గల్లంతయిన విషయం తెలుసుకుని నిశ్చేష్టులమయ్యామన్నారు. జీవీఎంసీ, పోలీస్, నేవీ, ఫైర్, మీడియా సహకారంతో నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికి అచూకి తెలియకపోవడంతో పలు కోణాల్లో ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు. ముఖ్యంగా పాప కొట్టుకుపోవడం ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదని చెప్పడం కూడ ఆశలు కలిగిస్తోందన్నారు. సంఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరాలేకపోవడంతో ఎవరూ చూడలేకపోయామని చెబుతున్నారన్నారు. పాప వెనుక స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, సుమారు 3..5 అడుగుల ఎత్తు ఉంటుందని, అడుగున్నర మేర ఉన్న కాలువలో కొట్టుకుపోవడం కష్టతరమనిపిస్తోందని చెప్పారు. వీటినిబట్టి చూస్తే చిన్నారిని ఎవరైనా అపహరించారా.. కాలువలో నుంచి ఎక్కడైన ఎవరైన రక్షించి వారివద్ద ఉంచుకున్నారా.. అనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఏదేమైనా చిన్నారి సజీవంగా, క్షేమంగా ఉంటుందనే ఆశలు చిగురిస్తున్నాయన్నారు. అదే కోణంలో దర్యాప్తు చేపట్టి పాపను కాపాడాలని కోరారు. చిన్నారి తల్లికి ఇప్పటివరకు నీటిలో గల్లంతయిందని చెప్పలేదనిఐ ఎక్కడో తప్పిపోయిందని, వెతుకుతున్నామని చెబుతున్నామన్నారు. ఇంటిలో అదితి గీసిన చిత్రాలను చూపిస్తూ కుటుంబ సభ్యులు విలపించారు. బెంగళూరులో చదువుతున్న అదితి సోదరుడు అనీష్ (8) మాట్లాడుతూ తన చె ల్లి చాలా హుషారుగా ఉండేదని, ఎక్కడ ఉన్నా తిరిగి ఇంటికి వచ్చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. చెల్లి తిరిగి వస్తే అందరికి మంచి పార్టీ ఇస్తానని చెప్పడం అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.. అదితి అచూకి తెలికపోవడంతో ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రుల మంతా కోరుకుంటున్నామని హైదరాబాద్‌కు చెందిన బాలిక మేనమామ భాస్కర్‌తో పాటు, స్నేహితులు తెలిపారు. -
తల్లడిల్లిన పసిహృదయం
బొడ్డూడని పసిగుడ్డును కర్కశ హృదయులు మురుగునీటిలో పడేశారు. కళ్లు తెరవక ముందే ఎలుకలు, పందికొక్కులు కొరుకుతుంటే ఆ పసిహృదయం తల్లడిల్లింది. కోటి కలలతో ప్రపంచాన్ని చూడాల్సిన ఆ శిశువు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. బహుశా భగవంతునికే ఈ పరిస్థితి చూసి మనసు చివుక్కుమందేమో! మత్స్యకారుడి రూపంలో వచ్చి రక్షించాడు. అయితే అప్పటికే ఎలుకలు కాళ్లు కొరికాయి. రక్తస్రావమైన పసి బిడ్డకు కేజీహెచ్‌లో చికిత్స అందజేస్తున్నారు. * అప్పుడే పుట్టిన బిడ్డను డ్రైనేజీలో పడేసిన కర్కశ హృదయులు * కాళ్లను ఎలుకలు కొరుక్కుతింటుండగా రక్షించిన మత్స్యకారుడు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని కేజీహెచ్ పిల్లల వార్డు గోడకు ఆనుకొని ఉన్న రెల్లివీధిలో బుధవారం వేకువజామున డ్రైనేజీలో ఎవరో బిడ్డను పడేసి పోయారు. సముద్రంలో చేపల వేటకెళ్తున్న మత్స్యకారుడు కారే నర్సింహులు శిశువు ఏడుపు విని పరుగున వెళ్లి చూసే సరికి రక్తపు మరకలతో ఉన్న బాలుడు కనిపించాడు. ఎలుకలు, పందికొక్కులు తింటున్న చిన్నారిని కాలువ నుంచి బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించాడు. అప్పటికే ఎలుకల దాడిలో తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలుడిని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పిల్లల వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉన్నా రెండ్రోజుల వరకు ఏ విషయం చెప్పలేమని పిల్లలవార్డు విభాగాధిపతి డాక్టర్ పద్మలత ‘సాక్షి’కి తెలిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..: ఘటనను కలెక్టర్ యువరాజ్ దృష్టికి తీసుకెళ్లాం. బిడ్డ 1.70 కిలోల బరువున్నాడు. బాలుడి కాళ్ల వేళ్లు కొరికిన ఆనవాళ్లున్నాయి. మురికినీళ్లలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ సోకింది. చికిత్స అందజేస్తున్నాం. కేజీహెచ్‌లో శిశువు అదృశ్యమైనట్టు మాకు ఫిర్యాదు అందలేదు. - మధుసూధనబాబు, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
పసికందును డ్రైనేజ్ లో పడేశారు..
అప్పుడే పుట్టిన పసికందును డ్రైనేజీలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన విశాఖపట్టణంలోని కేజీహెచ్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఆస్పత్రి పిల్లల వార్డు వెనక ఉన్న డ్రైనేజి కాలువలో మగశిశువు పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. పసికందును డ్రైనేజ్ నుంచి వెలికి తీసి చికిత్స అందించారు. కాగా శిశువు బతికే ఉందని.. కాళ్లను ఎలుకలు కొరికేశాయని అస్పత్రి అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.