
గతంలో డీటీసీపీ నుంచి.. ఇకపై హెచ్‌ఎండీఏ నుంచే ‘రియల్’ అనుమతులు
రెండు నెలలు గడుస్తున్నా స్పందన నిల్
లే అవుట్‌లు, నిర్మాణాలకు ఇప్పటి వరకు ప్రారంభించని పనులు...
కొత్తగా చేరిన ప్రాంతాల మ్యాపింగ్ చేపట్టినట్లు అధికారుల వెల్లడి
ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన హెచ్‌ఎండీఏ పరిధి
సాక్షి, సిటీబ్యూరో: ట్రిపుల్‌ఆర్ వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిని విస్తరించినప్పటికీ ఇంకా లే అవుట్‌లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం ప్రారంభం కాలేదు. దీంతో నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. హెచ్‌ఎండీఏ విస్తరణకు ముందు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ) నుంచి అనుమతులు లభించేవి. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలోని ప్రాంతాలన్నీ హెచ్‌ఎండీఏకు బదిలీ అయ్యాయి. రెండు నెలల క్రితమే ఈ బదిలీ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు లభించవలసి ఉంది. కానీ రెండు నెలలుగా దీనిపైన ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిర్మాణ సంస్థల్లో గందరగోళం నెలకొంది. రూ.కోట్లల్లో అప్పులు తెచ్చి భూములు కొనుగోలు చేసిన సంస్థలు వాటిని లే అవుట్‌లుగా అభివృద్ధి చేసేందుకు ఇటు డీటీసీపీ నుంచి అటు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు లభించకపోవడంతో సందిగ్ధంలో పడ్డాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సైతం ఇది ఆటంకంగా మారినట్లు నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రీజనల్ రింగురోడ్డు వరకు మారిన సీన్...
హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్‌రింగ్‌రోడ్డు వరకు అన్ని రకాల అనుమతులు, ప్రొసీడింగ్‌లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌లు, తదితర నిర్మాణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్త ప్రాంతాలను హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని 6 జోన్లలో చేర్చారు. హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించినప్పటి నుంచి ఆ పరిధిలో డీటీసీపీ అనుమతులను నిలిపివేసింది.
కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ నుంచి కొత్తగా ఎలాంటి అనుమతులు లభించలేదు. హెచ్‌ఎండీఏ వెలుపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం డీటీసీపీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్డ్‌నౌ పోర్టల్ సేవలను డీటీసీపీ ప్రాంతాలకు కూడా విస్తరించారు. కానీ గతంలో ఉన్న 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులు లభిస్తుండగా, కొత్తగా చేరిన 3,215 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్న గ్రామాలు, మండలాలు, మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతులు మొదలు కాకపోవడం గమనార్హం.
మ్యాపింగ్‌లో జాప్యమేల...
హెచ్‌ఎండీఏ కొత్తగా విస్తరించిన ప్రాంతాల మ్యాపింగ్‌లో జాప్యం వల్లనే అనుమతుల ప్రక్రియను ఇంకా ఆరంభించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మ్యాపింగ్ తుదిదశకు చేరిందని, త్వరలోనే పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రిపుల్‌ఆర్ వరకు రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు సైతం హెచ్‌ఎండీఏ కసరత్తును చేపట్టింది. దీంతో నిర్మాణరంగంపైన స్పష్టత కొరవడినట్లు రియల్‌వర్గాలు పేర్కొంటున్నాయి.
‘షాద్‌నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి లే అవుట్‌లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు నెలల నెంచి ఎదురుచూస్తున్నాం. కానీ ఈ మ్యాపింగ్ పూర్తయిన తరువాత అనుమతినిస్తారా లేక, కొత్త మాస్టర్‌ప్లాన్ వచ్చేవరకు నిలిపివేస్తారా తెలియడం లేదు.’ అని ఒక రియల్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ మెగామాస్టర్‌ప్లాన్ అమల్లోకి వచ్చే వరకు అనుమతులు లభించకపోతే తాము తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని పేర్కొన్నారు. భారీ లే అవుట్‌లే కాకుండా అపార్ట్‌మెంట్‌లు, భవన నిర్మాణాలకు సైతం ఇబ్బందులు తలెత్తనున్నాయి.
హెచ్‌ఎంఏ డెవలప్‌మెంట్ ప్లాన్..
హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్ధిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) ఏర్పడింది.
ఈ హెచ్‌ఎంఏ (HMDA) పరిధిలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, బ్లూగ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలతో మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు చేపట్టారు. ఈ ప్రణాళికలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముసాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం నుంచి సరికొత్త మాస్టర్‌ప్లాన్ రానుంది.
చదవండి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఇక చకచకా!
ఈ క్రమంలో నిర్మాణరంగానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుమతులను ఎప్పటి నుంచి ఇస్తారనేది సందిగ్ధంగా మారింది.
బ్లూన్‌గ్రీన్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) వరకు చెరువులు, కుంటలు, తదితర నీటివనరులను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలను చేపట్టవలసి ఉంది.దీంతో అప్పటి వరకు వేచి ఉండవలసిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది.