
ఐదేళ్లలో 40 శాతం పెరిగిన కన్‌స్ట్రక్షన్ కాస్ట్
ద్రవ్యోల్బణం, కార్మికులు, ముడి పదార్థాల కొరత కారణాలనేకం..
దీంతో ఏటా ఇళ్ల ధరలు 9–12 శాతం పెరుగుదల
తక్కువ మార్జిన్లతో చౌక గృహాల సరఫరాలో క్షీణత
మన దగ్గర చ.అ. నిర్మాణానికి రూ.1,600–రూ.2,700
ఐదేళ్లలో 12 శాతం తగ్గిన అఫర్డబుల్ హౌసింగ్
లగ్జరీ ఇళ్లకైతే రూ.4 వేలకంటే ఎక్కువే ఖర్చు
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. సామాన్య, మధ్యతరగతి వాసుల కల సాకారం చేసే చౌక గృహాలకు నిర్మాణ వ్యయం భారంగా మారుతోంది. దేశంలో దశాబ్ద కాలంలో నిర్మాణ వ్యయాలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, నైపుణ్య కార్మికుల జీతభత్యాలు, లాజిస్టిక్స్ కొరత, ఇంధన ధరల పెరుగుదల, ముడి పదార్థాల సరఫరాలో అంతరాయాలు, మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక ఒడిదుడుకులు, ప్రభుత్వ విధానాలు వంటి కారణాలతో 2021 నుంచి కన్‌స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలతో గృహాల ధరలు వృద్ధి చెందడంతో పాటు అందుబాటు, మధ్యశ్రేణి గృహాల సరఫరా, డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో గృహ నిర్మాణ వ్యయాలు దాదాపు 40 శాతం మేర పెరిగాయి. మూడేళ్లలోనే ఏకంగా 27.3 శాతం పెరిగాయి. 2021 అక్టోబర్‌లో ప్రథమ శ్రేణి నగరాలలో గ్రేడ్–ఏ ప్రాజెక్ట్‌ల సగటు నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,200లుగా ఉండగా.. 2024 అక్టోబర్ నాటికి రూ.2,800లకు పెరిగిందని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణానికి చ.అ.కు రూ.1,500– 2,000, మధ్య శ్రేణి గృహాల నిర్మాణానికి చ.అ.కు రూ.2,000–2,800 మధ్య ఖర్చు అవుతుంది. ఇక, లగ్జరీ గృహాల నిర్మాణం చేపట్టాలంటే చ.అ.కు రూ.4–5 వేల మధ్య ఖర్చవుతుంది.
విభాగాల వారీగా చూస్తే..
స్టాడర్డ్ మెటీరియల్స్, బేసిక్ ఫినిషింగ్‌లతో కూడిన చౌక గృహాల నిర్మాణానికి చ.అ.కు రూ.1,500– రూ.2 వేల మధ్య వ్యయం అవుతుంది. హైగ్రేడ్ మెటీరియల్స్, బ్రాండెడ్ ఫిట్టింగ్స్‌తో కూడిన మధ్యశ్రేణి ఇళ్ల కన్‌స్ట్రక్షన్‌కు చ.అ.కు రూ.2 వేల నుంచి రూ.2,800 మధ్య వ్యయమైతే.. విదేశీ ఉత్పత్తులు, హైఎండ్ ఆర్కిటెక్చర్, ఆధునిక వసతులు ఉండే లగ్జరీ గృహాల నిర్మాణానికి చ.అ.కు రూ.3 వేల నుంచి రూ.5 వేలు అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది.

వ్యయాల పెరుగుదల ఎందుకంటే?
ముడి పదార్థాలు: సిమెంట్, ఉక్కు, రాగి, అల్యూమీనియం వంటి నిర్మాణ సామగ్రి ధరలు స్థిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే సిమెంట్ ధరలు 15 శాతం మేర తగ్గితే.. ఉక్కు ధరలు 1 శాతం మాత్రమే తగ్గాయి. కానీ, ఐదేళ్లలో ఈ రెండు ముడి పదార్థాల ధరలు ఏకంగా 30–57 శాతం మేర పెరిగాయి. రాగి, అల్యూమీనియం ధరలూ ఇంచుమించుగా ఇదే రీతిలో పెరిగాయి. రాగి ధరలు ఏడాది కాలంలో 19 శాతం, ఐదేళ్లలో (2019–24) 91 శాతం వృద్ధి చెందాయి.కార్మికుల వ్యయాలు: నిర్మాణ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం నైపుణ్య కారి్మకుల కొరతే. దీంతో అందుబాటులో ఉన్న కార్మికులకు అధిక జీతభత్యాలు చెల్లించక తప్పని పరిస్థితి. గతేడాదితో పోలిస్తే కార్మికుల వ్యయాలు 25 శాతం, 2019తో పోలిస్తే ఏకంగా 150 శాతం మేర పెరిగాయి.
అనుమతులు: నిర్మాణ అనుమతుల ఆలస్యం, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా నిర్మాణ వ్యయాల పెరుగుదలకు కారణాలే. ఇంధన ధరల పెరుగుదల, కార్యాలయ నిర్వహణ వ్యయాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి.
కస్టమర్ల మీదే భారం..
చాలా మంది డెవలపర్లు పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులను పాక్షికంగా లేదా పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేస్తారు. ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఏటా గృహాల ధరలు 9–12 శాతం మేర పెరుగుతున్నాయి. చౌక గృహాల ధరలు చ.అ.కు రూ.500–800లు పెరిగినా కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసే వారితో పోలిస్తే రూ.5 లక్షల పెరుగుదల కస్టమర్లకు భారీ అదనపు భారమే అవుతుంది. ఇప్పటికే అఫర్డబుల్ హౌసింగ్ చేపట్టే డెవలపర్లు తక్కువ మార్జిన్ల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లడం లేదు. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం.. 2019లో చౌక గృహాల లాంచింగ్స్ 40 శాతంగా ఉండగా.. 2025 తొలి అర్ధభాగం నాటికి ఏకంగా 12 శాతానికి తగ్గింది. విక్రయాలో 2019లో సరసమైన గృహాల వాటా 38 శాతంగా ఉండగా.. 18 శాతానికి పడిపోయింది.
సుంకాల పెరుగుదల..
అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమీనియం, ఇతర నిర్మాణ సామగ్రిలపై సుంకాల పెరుగుదల కూడా నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపిస్తుంది. 25 శాతం సుంకాలు పెరిగితే దిగుమతులపై ఆధారపడే ప్రాజెక్ట్‌ల నిర్మాణ ఖర్చులు ప్రస్తుత స్థాయి కంటే 1.5–2.5 శాతం మేర పెరగవచ్చు. ఒకవేళ 50 శాతం మేర సుంకం విధించినట్లయితే నిర్మాణ వ్యయాలు 5 శాతం, అంతకంటే ఎక్కువే పెరుగుతాయి. దీంతో దిగుమతులపై ఆధారపడే లగ్జరీ, వాణిజ్య ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు కాస్త ఆలస్యమవుతాయి.
జీఎస్టీ సవరణ మేలు..
ప్రభుత్వం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సవరణ ప్రతిపాదనలు నిర్మాణ రంగానికి భారీ ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీఎస్టీలో కేవలం 5, 18 శాతం అనే రెండు రేట్లు మాత్రమే ఉంటాయని, అలాగే సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించింది. ఇది కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులపై మొత్తం పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ తగ్గింపులు ఇప్పటికే 1 శాతం పన్ను విధిస్తున్న చౌక గృహాలపై తగ్గింపు పరిమితంగానే ఉంటుంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను పునరుద్ధరిస్తే ధరలు 2–4 శాతం వరకు తగ్గుతాయి. మధ్యశ్రేణి గృహ విభాగంలో జీఎస్టీ 5–3 శాతం మేర తగ్గిస్తే.. ధరలు 2–4 శాతం తగ్గుతాయి. అయితే లగ్జరీ గృహ విభాగంలో ఇన్‌పుట్ ఖర్చులు తగ్గినప్పటికీ.. ఆయా ప్రాజెక్ట్‌లలో వినియోగించే ప్రీమియం, బ్రాండెడ్ నిర్మాణ సామగ్రితో ధరల తగ్గింపు పెద్దగా ఉండకపోవచ్చు.
ఇదీ చదవండి: ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం