ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్‌ అవసరం | Tips for Buying Your First Home: Smart Financial Planning for Future Homeowners | Sakshi
Sakshi News home page

ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్‌ అవసరం

Aug 23 2025 11:30 AM | Updated on Aug 23 2025 11:48 AM

Strong financial planning is essential for owning a house

తమకంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రియల్‌ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేరైతే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ప్రాంతం, ప్రాజెక్ట్, బడ్జెట్‌తో పాటు ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా, వారి వారి వెసులుబాటు బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 
    – సాక్షి, సిటీబ్యూరో

సొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే.. మరికొందరు ఉద్యోగ విరమణ వయసు నాటికి గానీ కొనుక్కోలేరు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. కనీసం ఐదారేళ్ల ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక చేస్తేనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలను పలువురు డెవలపర్లు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ముందు నుంచే పక్కా ఆర్థిక ప్రణాళికంగా వ్యహరించాలి.

పొదుపు చేస్తేనే.. 
సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలి. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతినెలా సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. కనీసం నెలకు రూ.10 వేల నుంచి, ఆ తర్వాత ఎవరి ఆదాయాన్ని బట్టి ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్‌పేమెంట్‌కు అవసరమయ్యే 15–20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణాన్ని తీసుకోవచ్చు.

బడ్జెట్‌ను బట్టే నిర్ణయం.. 
ప్రతినెలా పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగస్తులైతే పీపీఎఫ్‌లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టీలు వేయడం, మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ చేయడం వంటి మార్గాలను అన్వేషించాలి. అంతేకాకుండా బ్యాంక్‌లు, పోస్టల్‌ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇంటి బడ్జెట్‌ ఎంతో ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా ఆయా ధరల్లో ఇల్లు కొనుగోలు ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement