
ఆగస్టు 8 వరకు బిడ్ల స్వీకరణ, 12న వేలానికి సన్నాహాలు
17 చోట్ల ప్లాట్ల వేలం, అప్‌సెట్ ధరను ప్రకటించిన టీజీఐఐసీ
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకంగా మారిన టీజీఐఐసీ మరోమారు అత్యంత విలువైన భూముల వేలానికి సిద్ధమైంది. రాయదుర్గ్, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లోని 66 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని భావిస్తోంది. వేలం విధివిధానాల్లో సహకరించేందుకు సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
వచ్చే నెల 8 వరకు వేలం కోసం బిడ్లను స్వీకరించి 12న వేలం ప్రక్రియను పూర్తిచేసేలా టీజీఐఐసీ షెడ్యూల్ విడుదల చేసింది. 17 ప్లాట్ల వేలానికి సంబంధించిన అప్‌సెట్ ధర(మినిమం బేస్ ప్రైస్)ను టీజీఐఐసీ ప్లాట్లవారీగా నిర్ణయించింది. రాయదుర్గ్‌లోని 15ఏ/2, 14ఏ/1 ప్లాట్ల అప్‌సెట్ ధరను చదరపు గజానికి రూ.1,51,484గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరం ధర రూ.104 కోట్లుగా తేల్చింది. మిగతా ప్లాట్లలో అప్‌సెట్ ధరను కనిష్టంగా రూ.12.20 కోట్ల నుంచి రూ. 50.10 కోట్లుగా నిర్ణయించింది.
ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!
మొత్తం 66 ఎకరాలను టీజీఐఐసీ విక్రయించనుండగా వాటిలో 4 ప్లాట్లు రాయదుర్గంలో, మరో 13 ప్లాట్లు ఉస్మాన్‌నగర్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని 2014–23 మధ్య టీజీఐఐసీ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 21 వేల కోట్ల ఆదాయం సమకూర్చినట్లు సమాచారం.