
మైక్రోసాఫ్ట్ 2025 ప్రారంభం నుంచి వివిధ సందర్భాల్లో తొలగించిన 15,000 మంది ఉద్యోగులను ఉద్దేశించి కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ నాలుగో విడత ఉద్యోగాల కోత సందర్భంగా విడుదల చేసిన అంతర్గత మెమోలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు.
‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవి నాపై ఎంతో భారాన్ని మోపుతున్నాయి. మనం కలిసి పనిచేసిన, కలిసి నేర్చుకున్న లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్న వ్యక్తులపై ప్రభావం ఉంటోంది. కంపెనీని విడిచి వెళ్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, గేమింగ్, మిడిల్ మేనేజ్‌మెంట్‌తో సహా వివిధ విభాగాలలో ఈ సంవత్సరం మొత్తంగా 15,000 మందిని తొలగించింది. ఇటీవల సత్య చేసిన ప్రకటనతో మరో 9,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
బలమైన ఆర్థిక పనితీరు అయినా..
బలమైన ఆర్థిక పనితీరు ఉన్న సమయంలోనూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతలను అనుసరిస్తోంది. కంపెనీ ఇటీవల త్రైమాసిక నికర ఆదాయం 18 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయినా పునర్నిర్మాణం పేరిట కొలువులను తొలగిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో పనితీరు ఆధారిత సమీక్షలతో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. తరువాత మే, జూన్, జులైలో ఇవి పెరుగుతూ వచ్చాయి. ఈ లేఆఫ్స్‌తో గేమింగ్ యూనిట్ భారీగా ప్రభావితం చెందింది. 3,000కి పైగా కొలువుల కోత ఈ ఒక్క విభాగంలోనే ఉంది. ‘ది ఇనిషియేటివ్’ వంటి స్టూడియోలను కంపెనీ మూసివేసింది. ఎక్స్ బాక్స్, పర్ఫెక్ట్ డార్క్ గేమ్‌లను రద్దు చేసుకుంది.