
టెక్ రంగంలో ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందనే భయాలు నెలకొంటున్న తరుణంలో జోహో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. జోహోలో ఇంజినీర్లను ఏఐ భర్తీ చేయగలదా అని కంపెనీ సీఈఓ మణి వెంబును అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని ప్రభావం లేదని సమాధానం చెప్పారు. ఇటీవల ఓ సమావేశంలో వెంబు మాట్లాడారు.
‘కృత్రిమ మేధ కారణంగా జోహోలో ఉద్యోగాల్లో కోత లేదు. మీరు ఏఐ వ్యవస్థను ఒక కంటెంట్‌ను సృష్టించమని అడిగితే అది చాలా మెరుగ్గా కంటెంట్‌ను ఇస్తుంది. అయితే కేవలం ఈ ఫీచర్ మా కంపెనీలో ఉద్యోగాలను తొలగించలేదు. ఇప్పటివరకు కృత్రిమ మేధ కారణంగా మేము సిబ్బందిని తగ్గించలేదు. వాస్తవానికి మరికొందరు ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన జోహోలిక్స్ కార్యక్రమంలో వెంబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జియా అని పిలువబడే కంపెనీ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ భారతదేశపు మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఏఐ అని చెప్పారు. ఇది సాధారణ ప్రజల కోసం ఉద్దేశించింది కానప్పటికీ, ఈ నమూనా వ్యాపారాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. దీన్ని జోహో ఉత్పాదకత, ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలు
కృత్రిమ మేధ కంపెనీ వర్క్ ఫ్లోలో భాగమవుతోందని వెంబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు మరింత సహాయపడుతుందని నమ్ముతున్నారు. ‘ఇప్పటివరకు (జోహోలో) మేము కంపెనీలో ఏఐ కచ్చితంగా ఉద్యోగులను భర్తీ చేయడాన్ని చూడలేదు. దానికి బదులుగా ఇది ఉద్యోగులకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక సపోర్ట్ రిప్రజెంటేటివ్ సాధారణంగా రోజుకు 20 టిక్కెట్లను హ్యాండిల్ చేస్తాడనుకోండి.. ఏఐ సాయంతో 25 టిక్కెట్లను నిర్వహించే అవకాశం ఉంది. ఇది 20 శాతం వరకు ఉత్పాదకతను పెంచుతుంది’ అని చెప్పారు.