
మాస్టర్‌ప్లాన్ –2050లో జోన్‌లు మారితే కష్టమే..
గతంలో అనుమతులిచ్చిన స్థలాలు కన్జర్వేషన్‌లోకి మార్పు
మరోసారి అలాగే జరిగితే ఎలా అంటున్న నిర్మాణ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్‌ఆర్ వరకు భవన నిర్మాణాలు, లే అవుట్‌ల కోసం హెచ్‌ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. కానీ ఈ అనుమతులపైన నిర్మాణసంస్థలు, ‘రియల్’ వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.‘మాస్టర్‌ప్లాన్–2050 ’రూపొందించకుండానే ఇస్తున్న అనుమతుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటే ఆర్థికంగా భారీగా నష్టపోవలసి రావచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అందజేస్తున్న అనుమతులకు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని, కొత్తగా తయారుచేస్తున్న మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతులను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా జోన్‌ల మార్పుపైన వివిధ వర్గాల నుంచి ఆందోళన వెల్లువెత్తుతోంది.
అప్పటి మాస్టర్‌ప్లాన్ అమల్లోకి రావడానికి ముందే కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్‌లుగా భావించి అపార్ట్‌మెంట్‌లు, భవన నిర్మాణ లే అవుట్‌లకు అనుమతులను ఇచ్చారు. కానీ ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని నివాసిత స్థలాలు కన్జర్వేషన్ జోన్‌లోకి మారాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి మాస్టర్‌ప్లాన్ ప్రకారం నివాసిత మండలాల జాబితా లోంచి కన్జర్వేషన్ జోన్‌లోకి మారిన ప్రాంతాలను తిరిగి నివాసిత జోన్‌లోకి మార్చేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చిందని,ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్–2050 అమల్లోకి రాకుండానే ఇప్పుడు ఇచ్చే అనుమతుల వల్ల మరోసారి అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.
ఎందుకీ సమస్య..
మాస్టర్‌ప్లాన్–2050కి అనుగుణంగానే ప్రస్తుతం అనుమతులను అందజేస్తున్నట్లు అధికారులు భరోసాను ఇస్తున్నారు. కానీ వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపైన కొంత గందరగోళం నెలకొంది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా పులిమామిడి ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఓ బడా నిర్మాణ సంస్థ వేసిన లే అవుట్‌లకు హెచ్‌ఎండీఏ అనుమతులను అందజేసింది. కానీ ఆ తరువాత అమల్లోకి వచ్చిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతమంతా కన్జర్వేషన్ జోన్‌లోకి మారిపోయింది. దీంతో అక్కడ ప్లాట్‌లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కన్జర్వేషన్ నుంచి మరోసారి రెసిడెన్షియల్ జోన్‌లోకి మార్చుకొనేందుకు స్థలాల కొనుగోలుదార్లు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చింది.
ఒక్క పులిమామిడి ప్రాంతంలోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో అప్పటి మాస్టర్‌ప్లాన్‌లోని లోపాలపైన ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, తదితర జలవనరులకు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ జోన్‌లలోని స్థలాల మార్పు కోసం హెచ్‌ఎండీఏ అధికారులు దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల జలవనరులు ఉన్న ప్రాంతాలు కూడా నివాసిత మండలాల జాబితాలోకి మారిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్–2030 స్థానంలో కొత్తగా రానున్న మాస్టర్‌ప్లాన్–2050 నేపథ్యంలో హెచ్‌ఎండీఏ అనుమతులపైన గందరగోళం నెలకొంది.
మాస్టర్‌ప్లాన్ లక్ష్యం ఏంటి..
హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రాబోయే ఇరువై ఐదు సంవత్సరాలను లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) కోసం మాస్టర్‌ప్లాన్–2050 ను రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌నగరాన్ని ప్రపంచంలోని 10 అగ్రగామి గ్లోబల్‌నగరాల పక్కన నిలిపే లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధికి అనుగుణంగా మెగామాస్టర్‌ప్లాన్‌కు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో
నిర్మించనున్న రీజనల్‌రింగ్‌రోడ్డు వరకు అభివృద్ధి ప్రణాళికల కోసం హెచ్‌ఎండీఏ ఈ కసరత్తు చేపట్టింది. ఈ మెగామాస్టర్‌ప్లాన్ మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటిది ఆర్థికమండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఆర్థికాభివృద్ధి ప్రణాళిక (ఎకనమిక్ డెవలప్‌మెంట్ ప్లాన్) కాగా, రెండోది హైదరాబాద్ మెట్రో ఏరియా వరకు రహదారులు, మౌలిక సదుపాయలు, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, జలనరులు, అర్బన్‌ఫారెస్ట్‌లు, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రణాళిక బ్లూగ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు వివిధ దశల్లో ఉన్నాయి.
అనుమతులు తారుమారైతే ఎలా..
‘వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కొత్త మాస్టర్‌ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అనుమతులను ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ అనుమతులు తారుమారైతే పరిష్కారమేంటనే దానిపైన మాత్రం స్పష్టత లేదు.’ అని షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు తెలిపారు. ఇటీవల తాము 10 ఎకరాల్లో లే అవుట్ అనుమతులు తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ జోన్‌లోకి మారుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రాంతం ఆర్ధిక మండలాల జాబితాలోకి, లేదా బ్లూగ్రీన్ జోన్‌లోకి మారినా తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. అడవులు, జలవనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 3.5 కోట్లు దాటే అవకాశం ఉంటుందనే అంచనాలతో ఈ విస్తరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడిస్తోన్న నిర్మాణరంగ అనుమతులపైన మరింత స్పష్టత రావలసి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.