ట్రాన్స్‌జెండర్లకు అర్హతలు ఉంటే.. ‘డబుల్‌’ ఇవ్వండి

High Court Urges State Govt To Allot 2BHKs To Transgenders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి జారీచేసిన జీవో 10కి అనుగుణంగా ట్రాన్స్‌జెండర్లకు అర్హతలు ఉంటే వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశించాలంటూ సామాజిక కార్యకర్త సీహెచ్‌ ప్రియామూర్తితోపాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.

రేషన్‌కార్డు ఉన్న వారే డబుల్‌ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని, ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌కార్డులు లేవన్న కారణంగా వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లను ట్రాన్స్‌జెండర్లకు కేటాయించరాదన్న నిబంధన ఏమైనా ఉందా అని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది రాధీవ్‌రెడ్డిని ప్రశ్నించింది. అటువంటి నిబంధన ఏమీ లేదని, అయితే జీవో 10కి లోబడి అర్హతలు ఉన్న వారందరికీ కేటాయిస్తామని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top