హైడ్రా.. చట్టానికి అతీతం కాదు | High Court expressed strong displeasure over the conduct of the HYDRA Commissioner | Sakshi
Sakshi News home page

హైడ్రా.. చట్టానికి అతీతం కాదు

Jun 17 2026 4:32 AM | Updated on Jun 17 2026 4:32 AM

High Court expressed strong displeasure over the conduct of the HYDRA Commissioner

కమిషనర్‌ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట సర్వే నంబర్‌ 1, 2లోని భూయజమాని స్వాధీన హక్కులను రక్షిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలున్నా.. ప్రైవేటు ఆస్తిలో ప్రవేశించినందుకు హైడ్రా కమిషనర్‌ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికారులు కోర్టు ఉత్తర్వులను బహిరంగంగా ఉల్లంఘించారని.. వారు ప్రత్యేక విభాగ అధికారులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

కానీ వారు కూడా చట్టానికి అతీతులు కాదని.. పాలనా వ్యవస్థలో భాగమేనని స్పష్టం చేసింది. చట్ట పరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రాకు లేదని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఆ భూమిలోకి ప్రవేశించబోమని హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇవ్వడంతో దీన్ని ఉల్లంఘించవద్దని అధికారులను ఆదేశించింది. అలాగే పిటిషనర్‌ భూమిలోకి ప్రవేశించకుండా, వారి ప్రశాంత స్వాధీన, అనుభవ హక్కులకు భంగం కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధిక్కరణ పిటిషన్‌లో విచారణ ముగించింది.

భూమిపై హక్కు లేకున్నా ప్రవేశం సమ్మతం కాదు
లోతుకుంట గ్రామానికి చెందిన భూమి విషయంలో శాంతా శ్రీరామ్‌ నిర్మాణ సంస్థ ధిక్కార పిటిషన్లు దాఖలు చేసింది. భూమి వివాదానికి సంబంధించిన రిట్‌ అప్పీల్, సివిల్‌ సూట్, ఫస్ట్‌ అప్పీల్‌ తదితర కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోయినా హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించి తమ స్వాధీన భూమిలో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. 

‘సొసైటీ టు సేవ్‌ రాక్స్‌’ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు స్థలాన్ని సందర్శించారని హైడ్రా తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూమి తమదేనని నిరూపించడంలో సర్కార్‌ విఫలమైందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఆ భూమిపై ఎలాంటి హక్కు ఉండదని, హైడ్రా అధికారులు ప్రైవేట్‌ భూమిలోకి ప్రవేశించడం న్యాయసమ్మతం కాదన్నారు. హైడ్రా ఏర్పాటు ఉత్తర్వులను పరిశీలించిన న్యాయమూర్తి.. రహదారులు, కాలువలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సంస్థ పరిమితమని తేల్చిచెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement