‘జడి’పించి..దంచికొట్టి

Heavy Rain In Hyderabad Rain Forecast For Two Days - Sakshi

రాజధానిని ఒక్కసారిగా ముంచెత్తిన వర్షం

రహదారులన్నీ జలమయం

గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌   

అత్యధికంగా షేక్‌పేటలో 15.9 సెంటీమీటర్ల వాన

కూకట్‌పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మియాపూర్, రాజేంద్రనగర్‌లలో భారీ వాన 

లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు

విద్యుత్‌ ఫీడర్లు ట్రిప్‌ కావడంతో పలు ప్రాంతాల్లో అంధకారం

మరో రెండు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌:  పొద్దున్నుంచి ఎండగా ఉంది.. వేడి, ఉక్కపోత అనిపించింది.. మధ్యాహ్నానికీ ఎండ ముదిరింది.. సాయంత్రం ఓ వైపు ఎండ పడుతుండగానే మరోవైపు నుంచి వాన కమ్ముకొచ్చింది. కాసేపట్లోనే జడివానగా మారింది. పెద్ద చినుకులతో, వేగంగా కురిసిన వానతో పది నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి పొడిగానే ఉందన్న ఉద్దేశంతో రోడ్లమీదికి వచ్చిన వాహనదారులంతా ఆగమగం అయ్యారు.

రోడ్ల పక్కన బైకులు ఆపేసి.. దుకాణాల ముందు, ఫ్లైఓవర్లు, మెట్రోపిల్లర్ల కింద ఆగిపోయారు. అదే సమయంలో రోడ్ల మీద మోకాలిలోతు నీరు నిలవడం, మ్యాన్‌ హోళ్ల నుంచి నీరుపైకి తన్నడంతో కార్లు, బస్సులు వంటి వాహనాలూ ఆగిపోయాయి. దీనితో తీవ్రంగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మొత్తంగా రెండు గంటల పాటు ఆగకుండా కురిసిన వానతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు వచ్చాయి. 

ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ జామ్‌ 
కూకట్‌పల్లి, మాదాపూర్, మూసాపేట, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్, నాగోల్‌ తదితర రద్దీ ప్రాంతాలన్నింటా వాన కారణంగా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌కు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మీద కూడా వాహనాలు నిలిచిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, సుల్తాన్‌బజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఉస్మాన్‌గంజ్, ధూల్‌పేట్, ఆగాపురా, జాంబాగ్‌ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలిచాయి.

పలుచోట్ల వాహనాల ఇంజన్లలోకి నీళ్లు చేరి మొరాయించాయి.  ఫిలింనగర్‌ నుంచి మొదలు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఖైరతాబాద్‌ వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక శనివారం రాత్రిపూట బండ్లగూడ కార్పొరేషన్, మణికొండ, నార్సింగి, శంషాబా­ద్‌ మున్సిపాలిటీల పరిధిలో భారీ వర్షం కురిసింది. 

నిలిచిన విద్యుత్‌ సరఫరా 
భారీ వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల కాసేపటికి పునరుద్ధరించినా.. మరికొన్ని చోట్ల అర్థరాత్రి దాటే వరకూ మరమ్మతులు చేయలేదు. దీనితో పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. సెంట్రల్‌ సర్కిల్‌ పరిధిలోని ఐదు ఫీడర్లు, బంజారాహిల్స్‌ సర్కిల్లో నాలుగు, సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఒకటి, హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ పరిధిలో 4 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. వర్షం వెలిసిన వెంటనే అధికారులు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. 

చాలాచోట్ల ఐదు సెంటీమీటర్లకుపైనే.. 
శనివారం సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు మొదలైన వాన.. రెండు గంటల పాటు దంచి కొట్టింది. చాలా ప్రాంతాల్లో ఈ రెండు గంటల్లోనే ఐదారు సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల పది సెంటీమీటర్లకుపైగా కురిసింది. పరీవాహక ప్రాంతంలో వానలు పడుతుండటంతో హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట) జలాశయాలకు వరద పెరిగింది. దీనితో రెండు చొప్పున గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 

ముందే హెచ్చరించినా..
శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా.. జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top