రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ప్రశ్నల వర్షం | Harish Rao Demand for Clarity on RDS Water Allocation | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ప్రశ్నల వర్షం

Jun 25 2026 10:31 PM | Updated on Jun 25 2026 10:49 PM

Harish Rao Demand for Clarity on RDS Water Allocation

హైదరాబాద్‌: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల భర్తీని సంబరంగా జరుపుకోవడాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పక్కనపెట్టాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి హరీశ్‌ రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకు సంబంధించిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘ఆర్‌డీఎస్‌ నీటి కేటాయింపులపై స్పష్టమైన హామీలు సాధించారా? ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ఆర్డీఎస్ స్లూయిస్‌లను శాశ్వతంగా మూసివేయడానికి, అలాగే ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారా? కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాల్వ తక్షణ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ లభించిందా?

ఆర్డీఎస్ కింద తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుంది? ప్రస్తుతం ఉన్న గేట్లు దాదాపు 75 ఏళ్లుగా పనిచేస్తున్నాయి..ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు ఎప్పుడూ 5 టీఎంసీలకు మించి నీరు అందలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన సిస్టమ్ లాసెస్ అనే భావనను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారు?

బచావత్ ట్రైబ్యునల్ KWDT-I అవార్డులో సిస్టమ్ లాసెస్అనే భావనకు ఎలాంటి గుర్తింపు, అనుమతి గానీ లేదు.. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారా? కేసీ కెనాల్, సుంకేసుల వద్ద ఆంధ్రప్రదేశ్ నిరంతరం దాదాపు 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. కేసీ కెనాల్‌కు చెందాల్సిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను కర్ణాటకతో కుదుర్చుకున్న అవగాహన ద్వారా ఆర్‌బీహెచ్‌ఎల్‌సీ RBHLCలకు మళ్లిస్తున్నారు.

ఇది తెలంగాణకు జరుగుతున్న ఘోర అన్యాయం కాదా? ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తారా? తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారిన ప్రతిపాదిత ప్రాజెక్టులను వ్యతిరేకించారా? తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్య దాదాపు 35 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక నిర్మించ తలపెట్టిన నవేలి రిజర్వాయర్.. ఆర్డీఎస్, సుంకేసుల మధ్య దాదాపు 20 టీఎంసీల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనుకుంటున్న గుండ్రేవుల ప్రాజెక్టు.. రెండూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల వాటాను తీవ్రంగా దెబ్బతీసేవే.

​తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల న్యాయమైన వాటాను ఆయన సాధించారా? పెండింగ్‌లో ఉన్న ఆర్డీఎస్ సమస్యలను పరిష్కరించారా? ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కానప్పుడు, ఈ సంబరాలన్నీ కేవలం రాజకీయ ప్రచారం కోసమే తప్ప మరొకటి కాదు’’ అని ఎక్స్‌లో హరీశ్‌ రావు పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement