‘నేత’ రాత మారేదెలా? | Sakshi
Sakshi News home page

‘నేత’ రాత మారేదెలా?

Published Wed, Jan 17 2024 6:14 AM

Handloom cooperatives have not had an election from Last Six Years - Sakshi

సాక్షి, యాదాద్రి: ఆరేళ్లుగా చేనేత సహకార సంఘాల ఎన్నికల ఊసే లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఎన్నికలు జరగని కారణంగా టెస్కో ఉనికిలో లేకుండాపోయింది. 2018లో సహకార సంఘాల పదవీకాలం ముగిసింది. అయితే గత ప్రభుత్వం కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయకుండా పర్సన్‌ ఇన్‌చార్జ్‌లను నియమించింది.

రాష్ట్ర స్థాయి పాలకవర్గం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో చేనేత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారింది. గత ప్రభుత్వం టెస్కోకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్,పవర్‌లూమ్‌ కార్పొరేషన్లు కేవలం చైర్మన్ల నియామకం వరకే పరిమితమయ్యాయి. జియో ట్యాగింగ్, త్రిఫ్ట్‌ ఫండ్, చేనేత బీమా, నేతన్నకు చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం అమలు చేసినా అవి అందరికీ అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి.  

రాష్ట్ర వ్యాప్తంగా 375 సంఘాలు  
రాష్ట్ర వ్యాప్తంగా 375 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 45మంది కార్మికులు ఉన్నారు. అయితే 2018లో ఓటర్‌ ఫొటో గుర్తింపు కార్యక్రమం చేపట్టగా, జియో ట్యాగింగ్‌ విధానం అమల్లోకి తెచ్చి, కేవలం 9వేలమందిని లెక్క చూపిస్తున్నారు. మిగతా కార్మీకులు జియో ట్యాగింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సహకార సంఘాలకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా, పదవీకాలం 2018 ఫిబ్రవరి 9తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం పర్సన్‌ ఇన్‌చార్జ్‌లను నియమించి, ప్రతి ఆరునెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది.  

టెస్కో పాలకవర్గం ఎప్పుడు? 
ఉమ్మడి ఏపీలో చేనేత వృత్తిదారుల కోసం ఆప్కో ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా మారింది. అయితే ప్రస్తుతం టెస్కోకు పాలకవర్గం లేదు. సహకార సంఘాల ఎన్నికలు జరిగితే ప్రతి జిల్లా నుంచి ఒక డైరెక్టర్‌ను ఎన్నుకొని వారిలో నుంచి రాష్ట్రస్థాయి చైర్మన్, వైస్‌ చైర్మన్‌తోపాటు ప్రతి జిల్లా డైరెక్టర్‌ పాలకవర్గ సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం పాలకవర్గాలు లేవు. ఐఏఎస్‌ అధికారుల చేతిలో పాలన కొనసాగడంతో వృత్తిదారుల సమస్యలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా ఎన్నికలు నిర్వహించాలని చేనేత వృత్తిదారులు కోరుతున్నారు.  

మూతపడిన సిరిపురం సొసైటీ 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట మండలం సిరిపురం చేనేత సహకార సంఘంలో 1000 మంది సభ్యులు ఉన్నారు. సుమారు 40 ఏళ్లుగా వృత్తిదారులకు పని కల్పిస్తోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలనలో సొసైటీ రూ.40 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. జియో ట్యాగింగ్‌ పేరుతో 150 మందినే పనిదారులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు.  

సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి – అప్పం రామేశ్వరం, సిరిపురం సొసైటీ మాజీ చైర్మన్‌ 
చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కొండాలక్ష్మణ్‌ బాపూజీ సహకార స్ఫూర్తితో ఏర్పడిన సహకార సంఘాల వల్ల చేనేత కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. పాలకవర్గం లేకపోవడంతో చేనేత సమస్యలను మాట్లాడేవారు లేకుండా పోయారు.  

వస్త్రాల తయారీకి ఆర్డర్‌ ఇవ్వాలి  
ప్రభుత్వం వినియోగిస్తున్న వ్రస్తాల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల మాదిరిగా మాకూ ఇవ్వాలి. చేనేత సొసైటీలకు ఇస్తున్నట్టుగానే డీసీసీబీ రుణాలు ఇవ్వాలి. పవర్‌లూమ్‌లకు వ్రస్తాలను తయారు చేసే ఆర్డర్‌లు ఇవ్వాలి. వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలి.  
– గాడిపల్లి శ్రవణ్‌ కుమార్, మాజీ చైర్మన్, శ్రీతారకరామ పవర్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్, ప్రొడక్షన్, అండ్‌ సేల్స్‌ సొసైటీ, రఘునాథపురం   

Advertisement
 
Advertisement