సాక్షి, పల్నాడు: రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్‌ను టీడీపీ గుండాలు పొట్టనబెట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలను రాజకీయం చేస్తుండడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
‘‘కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగంలో గురజాల నియోజకవర్గంలో ఏడు రాజకీయ హత్యలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో గురజాల నియోజకవర్గానికి కృష్ణానది నీటిని ఇచ్చాం. టీడీపీ వచ్చాక డయేరియాతో జనం చనిపోయే పరిస్థితి. పిన్నెల్లిలో వైసీపీకి చెందిన రెండు, మూడు వందల కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. నాలుగు రోజులక్రితం టీడీపీవాళ్లు ఎస్సీ నేత సాల్మన్ ఇంటిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. అసలు ఊరిలోకి ఎవరు రమ్మన్నాడు అంటూ సీఐ భాస్కర్ మాట్లాడారు. పైగా సాల్మన్‌పైనే ఎదురు కేసు పెట్టారు.

నాలుగు రోజులు చికిత్స తర్వాత సాల్మన్ చనిపోయాడు. కనీసం హత్యాయత్నం కేసు కూడా నమోదు చెయ్యలేదు. సీఐ భాస్కర్ లాంటి పోలీసు అధికారిని సస్పెండ్ చెయ్యాలి. అంత్యక్రియలు ఊర్లో చెయ్యాలంటే కుదరదంటున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికే సాల్మన్ కుటుంబ సభ్యలతో మాట్లాడారు. ఈ కేసులో మా పోరాటం కొనసాగుతుంది. న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తాం. మేం అధికారంలోకి రాగానే సీబీసీఐడీ విచారణ చేపడతాం. మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు... మీకు గుణపాఠం చెబుతాం. గ్రామంలో శాంతికమిటీ వేసి గొడవలు జరగకుండా చూడాలి. ఇవాళ ఇది జరగకుంటే.. పోలీసులను అడ్డంపెట్టుకుని బచ్చాగాడు కూడా మాట్లాడతారు. పిన్నెల్లిలో సాల్మన్ అంత్యక్రియలు జరగకపోతే రేపు జగన్ వస్తారు.. అని కాసు తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘పిన్నెల్లిలో కుటుంబాలకు కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్లారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా వెలివేతలు జరిగాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారా?..

గతంలో రషీద్, భూషయ్య.. ఇప్పుడు సాల్మన్‌ను హత్య చేశారు. సాల్మన్ పై పెట్టిన కేసు పోలీసుల దుర్మార్గానికి పరాకాష్ఠ. చనిపోయిన వ్యక్తిపై 324సెక్షన్ కింద కేసు నమోదు చెయ్యడం పోలీసుల తీరుకు నిదర్శనం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిగానీ బాధితుల మీద కాదు. కనీసం అంత్యక్రియలకు సొంతూరు కూడా వెళ్లనియ్యరా?. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

టీడీపీ బెదరింపు పోస్టర్లు
వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సాల్మన్ కుటుంబ సభ్యలతో కలిసి పిన్నెల్లి బయల్దేరాఉ. అయితే.. అంత్యక్రియలను జరగనివ్వమని, వైఎస్సార్‌సీపీ నేతలు గ్రామంలో అడుగుపెడితే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. గ్రామంలో అంతటా వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ ఫ్లెక్సీలు వేయించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.


