పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల
జీవో జారీ చేసిన ప్రభుత్వం
డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగానే రిజర్వేషన్లు
సోమవారం ఉదయం 10 గంటల్లోగా ఖరారు చేసి గెజిట్లు పంపించాలి
సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఆర్డీవోలు, వార్డుల రిజర్వేషన్లు ఎంపీడీవోలు చేయాలి
ముందుగా ఎస్టీ తర్వాత ఎస్సీ, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం జీవో (ఎంఎస్ నం.46) జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు (బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన) బదులు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
గతానికి భిన్నంగా.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగా రిజర్వేషన్లు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకుండా, రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలకు స్పష్టం చేసింది.
సర్పంచ్ రిజర్వేషన్లు ఎవరికి..ఎలా?
సర్పంచ్‌ల రిజర్వేషన్లు.. ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు, ఎస్సీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు, బీసీలకు సంబంధించి 2024 కులగణన (ఎస్‌ఈఈఈపీసీ)–2024 సర్వే ప్రకారం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ప్రతి కేటగిరీలో ఆయా పదవులను ఆ మేరకే రిజర్వ్ చేయాలి.
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసే పోస్టులకు సాధ్యమైనంత మేర రొటేషన్ పద్ధతిని (2019 మొదటి ఎన్నికలకు అనుగుణంగా) అనుసరించాలి. మహిళలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలను ప్రత్యేక కేటగిరీలుగానే పరిగణించి రిజర్వేషన్లు కేటాయించాలి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను (అన్ని వార్డులను) ఎస్టీలకే రిజర్వ్ చేయాలి.
వార్డు సభ్యులకు ఇలా..
వార్డు సభ్యుల స్థానాలకు..ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల రిజర్వేషన్లు కులగణన (ఎస్‌ఈఈఈపీసీ)–2024 సర్వే ప్రకారమే ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేస్తారు. అయితే ప్రతి కేటగిరీలో సీట్ల రిజర్వేషన్‌ను కమిషన్ సూచనల ప్రకారమే చేయాలి. ఈ రిజర్వేషన్లను కూడా వీలైనంత మేర రొటేషన్ పద్ధతిలోనే చేయాలి. కులగణన (ఎస్‌ఈఈఈపీసీ)–2024 సర్వేకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా ప్రతి కేటగిరీ (ఎస్టీ, ఎస్సీ, బీసీ) జనాభా లెక్కలను అవరోహణ (డిసెండింగ్) పద్ధతిలో సిద్ధం చేయాలి.
దీనికి అనుగుణంగా మొదట ఎస్టీలకు (డిసెండింగ్ ఆర్డర్‌లో) 2019 మొదటి ఎలక్షన్‌లో కేటాయించిన సీట్లను మినహాయించి, మిగతా వార్టులను ఎస్టీలకు రిజర్వ్ చేసే విషయం పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, బీసీ కేటగిరీల్లోనూ గతంలో (మొదటి ఎన్నికల్లో) చేసిన రిజర్వేషన్లను మినహాయించి మిగతా వాటికి రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఈ కేటగిరీల రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యాక మిగిలిపోయిన వాటిని అన్ రిజర్వ్‌డ్‌గా పరిగణించాలి.
ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆన్ రిజర్వ్‌డ్.. అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయించేందుకు లాటరీ పద్ధతిని అనుసరించాలి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ (మహిళ), ఎస్సీ (మహిళ), బీసీ (మహిళ), అన్ రిజర్వ్‌డ్ (మహిళ)..ఇలా సెపరేట్ కేటగిరీలుగా చేయాలి. 2018 పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా.. 2019లో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు చేయాల్సి ఉన్నందున, ఆ తర్వాత జరిగే ఎన్నికలను రెండో సాధారణ ఎన్నికలుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత కొత్తగా నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే ఎన్నికలను మొదటి ఎన్నికలుగానే పరిగణిస్తారు.
పెన్ డ్రైవ్‌లో పెట్టి పంపాలి
జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్, స్కాన్డ్ కాపీలు పెన్‌డ్రైవ్‌లో పెట్టి ఈ నెల 24నఉదయం 10 గంటల లోగా పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయానికి పంపించాలని జిల్లా కలెక్టర్లను పీఆర్‌ఆర్‌డీ డైరెక్డర్ డా.జి సృజన ఆదేశించారు. ముందుగానే పూర్తిచేస్తే ఆదివారమైనా తమ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేసేందుకు లాటరీ పద్ధతిని అనుసరించనున్నందున.. అది అన్ని రాజకీయ పారీ్టల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణలకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు (జిల్లా ఎన్నికల అధికారులు) అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా.. వార్డు సభ్యులకు, సర్పంచ్ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీల్లో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ ఖరారు బాధ్యత రెవెన్యూ డివిజినల్ అధికారులకు (ఆర్డీవోలకు) అప్పగించారు.


