హైదరాబాద్: ఇటీవల కన్నుమూసి ప్రజాకవి అందెశ్రీ తనకు అత్యంత ఆప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) అందెశ్రీ సంస్మరణ సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. ఎంత అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలింది..
సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడా అంజన్న, అందెశ్రీ, గోరేటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారు.. బడి మొహం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారు. ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారు. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందెశ్రీ కోరుకున్నారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం.. ఆయన స్మృతి వనాన్ని నిర్మిస్తున్నాం, ఆయన పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.


