అప్పు పద్దు.. దాదాపు సగం తగ్గింది | Government reduces open market borrowings in second quarter | Sakshi
Sakshi News home page

అప్పు పద్దు.. దాదాపు సగం తగ్గింది

Jun 27 2026 4:00 AM | Updated on Jun 27 2026 4:01 AM

Government reduces open market borrowings in second quarter

2026–27 రెండో త్రైమాసికంలో బహిరంగ మార్కెట్‌ రుణాలు తగ్గించుకున్న ప్రభుత్వం

కేవలం రూ. 14 వేల కోట్లకే ఆర్‌బీఐకి ఇండెంట్‌ పెట్టిన ఆర్థిక శాఖ

మొదటి త్రైమాసికంలో రూ. 26 వేల కోట్లు బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అప్పుల భారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉపశమనం పొందనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో తీసుకునే అప్పును దాదాపు 50 శాతం తగ్గించింది. మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్‌–జూన్‌ మధ్య రూ. 26 వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణాలను తీసుకున్న ప్రభుత్వం.. రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌ మాసాల్లో)లో రూ. 14 వేల కోట్లు మాత్రమే తీసుకోనుంది. 

ఈ మేరకు ఆర్‌బీఐకి ఆర్థిక శాఖ ఇండెంట్‌ పెట్టింది. ఈ ఇండెంట్‌ ప్రకారం జూలైలో రూ. 4,600 కోట్లు, ఆగస్టులో రూ. 4,500 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 5 వేల కోట్లను బహిరంగ మార్కెట్‌లో సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా తీసుకోనుంది. అయితే ఈ నెల 30న రూ. 7 వేల కోట్లు తీసుకోనుండగా అవి జూలై ఒకటిన ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. 

కాగా, తొలి త్రైమాసికంలో రూ. 7 వేల కోట్లు కలిపి మొత్తం దాదాపు రూ. 26 వేల కోట్లను ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ ద్వారా రుణ సేకరణ చేసింది. దీంతో రెండు త్రైమాసికంలు కలిపితే బహిరంగ మార్కెట్‌ రుణ పద్దు ఈ ఏడాది సెప్టెంబర్‌ ముగిసే నాటికి రూ. 40 వేల కోట్లకు చేరనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ ద్వారా రుణ సేకరణ లక్ష్యం రూ. 73,383 కోట్లుకాగా అందులో 55 శాతం అంటే రూ. 40 వేల కోట్లు తొలి అర్ధ భాగంలో తీసుకోనుందన్నమాట.

25 ఏళ్లకుపైగా..
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తీసుకునే రుణాలను పలు కాల వ్యవ«ధుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. కొన్ని రుణాలు 6–10 ఏళ్ల కాలంలో, మరికొన్ని 11–15 ఏళ్లు, ఇంకొన్ని 16–20, మరికొన్ని 20–25 ఏళ్ల మధ్య కాలంలో చెల్లిస్తామని ఆర్‌బీఐకి ఇచ్చిన ఇండెంట్‌లో ప్రభుత్వం పేర్కొంది. చాలా తక్కువ మొత్తంలో రుణాల చెల్లింపునకు మాత్రం 25 కంటే ఎక్కువ సంవత్సరాల సమయం తీసుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి దేశంలోని 9 రాష్ట్రాలకు వర్తింపజేస్తున్న బెంచ్‌ మార్క్‌ ఇష్యూయెన్స్‌ స్ట్రాటజీ (బీఐఎస్‌) పద్ధతిలోనే రెండో త్రైమాసికంలోనూ ఆర్‌బీఐ మన రాష్ట్రానికి రుణాలను అందజేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement