యాసంగి బోనస్‌ రూ. 1,500 కోట్లు! | Government prepares to pay bonus for fine grain | Sakshi
Sakshi News home page

యాసంగి బోనస్‌ రూ. 1,500 కోట్లు!

Apr 10 2025 4:27 AM | Updated on Apr 10 2025 4:27 AM

Government prepares to pay bonus for fine grain

సన్న ధాన్యానికి చెల్లించేందుకు సర్కారు సన్నాహాలు 

సీజన్‌లో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం వస్తుందని అంచనా

నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సిద్దిపేటల్లో కొనుగోళ్లు షురూ

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.1,500 కోట్ల వరకు బోనస్‌ చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత వానాకాలం సీజన్‌ నుంచి క్వింటాలుకు రూ.500 బోనస్‌గా ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడతగా వానాకాలంలో 4.49 లక్షల రైతుల నుంచి సేకరించిన 23.98 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యానికి బోనస్‌ కింద ప్రభుత్వం రూ.1,199 కోట్లను రైతులకు చెల్లించింది. 

అయితే ఈసారి యాసంగి సీజన్‌లో ఏకంగా 70 ఎల్‌ఎంటీలకు పైగా ధాన్యాన్ని సేకరించవచ్చని లెక్కలు వేసిన ప్రభుత్వం అందులో సన్న ధాన్యం 30 ఎల్‌ఎంటీల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు సన్న ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తే, బోనస్‌ కింద రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు మొదలైన నేపథ్యంలో సన్న ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిన వెంటనే బోనస్‌ను వారి ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 

58.29 లక్షల ఎకరాల్లో 60 శాతం సన్నాలే..
రాష్ట్రంలో ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో 77.95 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగుకాగా, అందులో వరి ఏకంగా 58.29 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 60 శాతం వరకు విస్తీర్ణంలో సన్నాలే సాగైనట్లు ప్రాథమిక అంచనా. ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి అనుకుంటే 145 ఎల్‌ఎంటీల ధాన్యం వస్తుంది. 

అందులో సగం ధాన్యాన్ని రైతులు సొంత అవసరాలకు వినియోగించుకున్నా, బహిరంగ మార్కెట్‌కు విక్రయించినా, మరో 70 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కోతలు మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో వేగం పుంజుకోనున్నాయి. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించగా ఇప్పటికే 1,272 కేంద్రాలను సిద్ధం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలైనట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement