
8 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సర్కారు నిర్ణయం
బందరు ఓడరేవుతో నాలుగో నగరి అనుసంధానం
దీంతో జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య రవాణా సులువు
కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన
వచ్చే వెయ్యేళ్ల అవసరాలు తీర్చేలా భవిష్యత్తు నగరి అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాలుగో నగరి.. ఫ్యూచర్ సిటీతో రాష్ట్రాభివృద్ధి మరో దశకు చేరనుందని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తు నగరాన్ని వచ్చే వెయ్యేళ్ల అవసరాలను తీర్చేలా, ఒక నమూనాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న సర్కారు.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మధ్య ఎనిమిది లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించింది. ఈ రహదారి నిర్మాణం తర్వాత హైదరాబాద్–విజయవాడ మధ్య దూరం 70 కిలో మీటర్ల మేర తగ్గుతుందని చెపుతున్నారు.
మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రైల్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టులను ఓడరేవుతో అనుసంధానిస్తే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య రవాణాతో పాటు బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులను ఆకర్షించడం సులువవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నంలో బందరు పోర్టుకు అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. దీనికి త్వరలోనే అనుమతి మంజూరు అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ వెంట రెండు డ్రై పోర్ట్‌లు..
ఆర్‌ఆర్‌ఆర్, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులకు కూడా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. రీజనల్ రింగ్ రైల్‌ను బందరు పోర్టు లేదా ఇతర ఓడరేవుతో అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ట్రిపుల్‌ఆర్ వెంట రెండు డ్రై పోర్ట్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్, చౌటుప్పల్ లేదా ఖమ్మం వద్ద వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణ రైజింగ్..
రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (ఓఆర్‌ఆర్ లోపల), సెమీ ఆర్బన్ (ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య), గ్రామీణ (ఆర్‌ఆర్‌ఆర్, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల మధ్య) ప్రాంతం.. అని మూడు భాగాలుగా విభజించిన సర్కారు.. వీటిని సేవా, పారిశ్రామిక, వ్యవసాయ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.
2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తెలంగాణ రైజింగ్–2047 విజన్ పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించనుంది. దీనిని వచ్చే డిసెంబర్ 9న విడుదల చేయనుందని తెలుస్తోంది. ఆ రోజు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం కావడం గమనార్హం.