ఔటర్‌ నిర్వహణకు ‘గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే’.. 30ఏళ్ల పాటు టోల్‌ వసూలు, ఇంకా

Golconda Expressway For outer ring road management - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లీజు వ్యవహారంలో ముందడుగు పడింది. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ నిర్వహణ కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ) ఏర్పాటైంది. లీజు ఒప్పందంలో భాగంగా ‘ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే’ను ఎస్పీవీగా ఏర్పాటు చేశారు. ఇది ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా తరఫున ప్రాతినిధ్య సంస్థగా ఉంటుంది.

ఈ మేరకు ఈ నెల 28న హెచ్‌ఎండీఏతో కుదుర్చు­కున్న లీజు ఒప్పందంపై ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే సంతకాలు చేసింది. ఇక నిర్ణీత 120 రోజుల గడువులోపు లీజు మొత్తం రూ.7,380 కోట్లను చెల్లించి ఔటర్‌ నిర్వహణ బాధ్యతలను చేపడతామని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీరేంద్ర డి.మహిష్కర్‌ తెలిపారు. ఔటర్‌ ప్రాజెక్టును తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు చెప్పారు.

నిర్వహణ అంతా ‘గోల్కొండ’దే..
ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాతో కుదిరిన లీజు ఒప్పందం మేరకు వచ్చే 30ఏళ్ల పాటు ‘ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే’ సంస్థ.. ఓఆర్‌ఆర్‌పై వాహనాల నుంచి టోల్‌ వసూలు చేయడం, రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఇతర ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) బాధ్యతలను చేపట్టనుంది. హెచ్‌జీసీఎల్‌ ఇక ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న సర్వీస్‌ రోడ్లు, ఔటర్‌ మాస్టర్‌ప్లాన్‌ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితం కానుంది.

టోల్‌ రుసుముపై హెచ్‌ఎండీఏ పర్యవేక్షణ
2006లో హైదరాబాద్‌ మహానగరం చుట్టూ 8 లేన్లతో ఔటర్‌రింగ్‌రోడ్డును నిర్మించారు. 2018 నాటికి ఇది పూర్తయింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 2008లో విధించిన నిబంధనల మేరకు ఇప్పటివరకు టోల్‌ రుసుమును వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ టోల్‌ రుసుము పెంపుపై హెచ్‌ఎండీఏ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయని అధికారులు చెప్తున్నారు.

ఏకమొత్తంగా రూ.7,380 కోట్ల చెల్లింపు!
‘టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ) విధానంలో ఔటర్‌ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంవత్సరం నవంబర్‌ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్లు వచ్చాయి. ఇందులో చివరికి 4 సంస్థలు తుది అర్హత సాధించగా.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు టెండర్‌ దక్కింది. ఒప్పందం మేరకు లీజు మొత్తం రూ.7,380 కోట్లను ఐఆర్‌బీ సంస్థ ఒకేసారి చెల్లిస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు. ఒప్పందంలోని నిబంధనలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని.. మొత్తం నిధులు చెల్లించాకే ఔటర్‌ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top